మోదీ ప్రభుత్వం జనవిరోధి!

మోదీ ప్రభుత్వం జనవిరోధి!

 ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం చేపట్టిన జనాక్రోశ్ ర్యాలీలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీస్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతూనే.. చెప్పలేదంటారు. ఆయన మాటల్లో నిజాలను వెత్తుక్కోవడానికి ప్రజలు కష్టపడాల్సి వస్తున్నది. ఆయన హామీలిస్తారే తప్ప వాటిని అమలు చేయరు అని రాహుల్ పేర్కొన్నారు. మోదీజీ అవినీతిపరుల్ని పక్కనే ఉంచుకుని అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతారు.


దేశ ప్రజల డబ్బు నేరుగా నీరవ్ మోదీ జేబుల్లోకి వెళ్లింది. నీరవ్‌మోదీ ప్రజల సొమ్ముతో లండన్ పారిపోయాడు. కాంగ్రెస్ హయాంలో రూ.700కోట్లతో హెచ్‌ఏఎల్ విమానాలను కొనుగోలు చేస్తే, ఎన్డీయే ప్రభుత్వం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నది. నోట్లరద్దుతో ప్రజల నడ్డివిరిచారు. చిరు, మధ్యతరగతి వ్యాపారాలపై గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌తో చావుదెబ్బ కొట్టారు. దేశయువతకు ప్రధాని నిరుద్యోగాన్ని ప్రసాదించారు. దళితులు, మైనార్టీ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఉన్నావ్ లైంగికదాడి కేసులో ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేనే నిందితుడు.

అలాంటి వాటికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ నోరువిప్పడం లేదు. అబద్ధాలు, అన్యాయం దేశాన్నేలుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మోదీ ప్రభుత్వ ఆగ్రహానికి గురికావాల్సిందే. అందుకే ఇది జనవిరోధి (ప్రజావ్యతిరేక) ప్రభుత్వం అని రాహుల్ విమర్శించారు. దేశంలో రైతులకు మద్దతు ధర కల్పించడం లేదు. వారి రుణాలను మాఫీ చేయడం లేదు. నేను వ్యక్తిగతంగా కలిసి రుణమాఫీపై విన్నవించినా, ఆయన పట్టించుకోలేదు. కాంగ్రెస్ మాత్రమే వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరించగలదు అని చెప్పారు.

మోదీ ప్రభుత్వ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలతో మాట్లాడాను. మోదీ ప్రభుత్వంతో మీరు సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే.. వారి దగ్గరినుంచి లేదనే సమాధానమే వచ్చింది అని రాహుల్ అన్నారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తుంటారని ఆయన ఆరోపించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా బీజేపీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ సంక్షోభంలో పడింది. దేశమంతటా ఆర్‌ఎస్‌ఎస్ తమ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్నా మోదీ మౌనంగా చూస్తున్నారు. ఈ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.

అందుకే కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతున్నది. ఇప్పటినుంచి ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్సే గెలుస్తుంది. 2019 లోనూ అధికారంలోకి వస్తుంది. వచ్చే నెలలో జరిగే కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయం అని రాహుల్ ధీమా వ్యక్తంచేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి హుబ్లీ వెళ్లినప్పుడు విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయాన్ని ప్రస్తావించిన రాహుల్.. ఆ సమయంలో తనకు దేవుడు మాత్రమే గుర్తుకు వచ్చాడని, అందుకే కర్ణాటక ఎన్నికల తర్వాత కైలాస్ మానససరోవర్ యాత్రకు వెళ్తానని తెలిపారు.