మైనార్టీ తీరని భార్యతో సెక్స్‌ నేరం : సుప్రీం

మైనార్టీ తీరని భార్యతో సెక్స్‌ నేరం : సుప్రీం

 న్యూఢిల్లీ : మైనార్టీ తీరని 15-18 సంవత్సరాల వయస్సు గల భార్యతో సెక్స్‌లో పాల్గొనడం నేరమేనని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అత్యాచార చట్టంలో ఉన్న మినహాయింపు ఏకపక్షంగాను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగాను ఉందని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఐపిసి సెక్షన్‌ 375 అత్యాచార నేరాన్ని నిర్వచిస్తోంది. అందులో 15 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సున్న భార్యతో సెక్స్‌లో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదంటూ ఒక మినహాయింపు నిబంధన ఉంది.

అయితే సెక్స్‌లో పాల్గొనేందుకు అనుమతించ దగ్గ వయస్సును 18 సంవత్సరాలని సుప్రీం కోర్టు గతంలో ప్రకటించింది. అత్యాచార చట్టంలోని ఆ మినహాయింపు ఇతర చట్టాలలోని తత్త్వాన్ని, మైనర్‌ బాలిక శారీరక సమగ్రతను ఉల్లంఘిస్తోందని సుప్రీం తెలిపింది. ఇండిపెండెంట్‌ థాట్‌ అనే స్వచ్ఛంద సంస్ధ తరపున దీనికి సంబంధించిన పిటిషన్‌ సుప్రీం కోర్టులో దాఖలైంది. ఎన్జీఓ తరుపున అడ్వకేట్‌ గౌరవ్‌ అగర్వాల్‌ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తులు మదన్‌ బి. లోకూర్‌, దీపక్‌ గుప్తాలు పిటిషన్‌పై విచారణ జరిపారు. ఈ సందర్భంగా దేశంలో కొనసాగుతున్న బాల్య వివాహ వ్యవస్థపై న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయ చట్టాల అమలులో ఆ స్ఫూర్తి కొరవడిందని వ్యాఖ్యానించారు.