మొరాయించిన ఓటింగ్‌ యంత్రాలు

మొరాయించిన ఓటింగ్‌ యంత్రాలు

 భోపాల్‌  : బుధవారం జరిగిన మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక చోట్ల ఓటింగ్‌ యంత్రాలు మొరాయించాయి. ముఖ్యంగా మధ్య ప్రదేశ్‌లో అనేక నియోజక వర్గాల్లో ఓటింగ్‌ యంత్రాల్లో సాంకేతిక లోపాల గురించి ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 883 బ్యాలట్‌ యూనిట్లు, 881 కంట్రోల్‌ యూనిట్లు, 2,126 వీవీపీఏటీలను మార్చి, వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలలో ఇవిఎంలు, వివిపిఎటిలు పనిచేయకపోవడంతో పోలింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మోహనా పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 55 లో ఇవిఎం పనిచేయడంలేదని, అలాగే ఉజ్జయినిలో కూడా ఇవిఎంలు మొరాయించడంతో వాటిని మార్చినట్లు అధికారులు తెలిపారు.

అలాగే అలీరాజ్‌పూర్‌లోని 11వివిపిఎటిలను మార్చవలసిరావడంతో పోలింగ్‌ ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలిపారు. బుర్హాన్‌పూర్‌లో ఐదు వివిపిఎటిలు, రెండు ఇవిఎంల సమస్యతో పోలింగ్‌ ఆలస్యంగా మొదలైనట్లు తెలిపారు. రాజధాని భోపాల్‌లో రెండు ఇవిఎంలను మార్చవలసి వచ్చిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 227 స్థానాల్లో పోలింగ్‌ జరగాల్సివుంది. మిగతా మూడు స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఆయా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించాలి వుంది. అయితే, ఓటింగ్‌ యంత్రాల్లో లోపాల కారణంగా పలు ప్రాంతాల్లో ఓటింగ్‌ ప్రక్రియ చాలా ఆలస్యమయింది.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీఎల్‌ కాంతారావ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.5 శాతం ఓటింగ్‌ యంత్రాలను మార్చి కొత్త వాటిని వినియోగించినట్లు తెలిపారు. 'ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల్లో ముగ్గురు గుండెనొప్పి కారణంగా మృతి చెందారు. భింద్‌ జిల్లా గధ్‌పురాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓ ఘర్షణలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి' అని ఆయన తెలిపారు. మరికొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి.