ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

 బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్‌ వజూభారు వాలా అతనితో రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో గురువారం ఉదయం హడావిడిగా రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి అనుమతిచ్చిన గవర్నర్‌ 15 రోజుల్లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సూచించారు. దీంతో బల నిరూపణ తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు గవర్నర్‌ బిజెపిని ఆహ్వానించడంతో కాంగ్రెస్‌, జెడి(ఎస్‌)కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

స్టే విధించడం కుదరదని పేర్కొంటూ ప్రమాణ స్వీకారానికి సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అవకాశమివ్వాల్సిందిగా ఈనెల 15, 16వ తేదీలలో గవర్నర్‌ వజూభాయ్‌కు బిజెపి సమర్పించిన లేఖలను సమర్పించాల్సిందిగా అటార్నీ జనరల్‌ను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 18న చేపడతామని తెలిపారు. గుర్రపు వర్తకంలో(ఎమ్మెల్యేలను కొనడంలో) బిజెపి పూర్తిగా మునిగిపోయిందని జెడి(ఎస్‌) ఆరోపించింది. సిఎంగా యడ్యూరప్ప గురువారం మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారని మొదట వార్తలచ్చినప్పటికీ స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో ఉదయమే ప్రమాణం చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి.