ముంబయిని ముంచెత్తుతున్న వరదలు

ముంబయిని ముంచెత్తుతున్న వరదలు

 న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబయిలో వారం రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు నగరంలో వరద పరిస్థితిని తలపిస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ నుండి అతి భారీ వర్షం కురియనున్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించాలని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలగఢ్‌ జిల్లాలోని మానిక్‌పూర్‌ గ్రామానికి చెందిన 400 మంది ఉప్పుమండి కార్మికులను వారి కుటుంబ సభ్యులతో సహా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పశ్చిమ రైల్వేకు చెందిన పలు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. వసారు-విరార్‌ స్టేషన్ల మధ్య రైలు సర్వీసులు నిలిచిపోయాయి. కొద్ది రోజులుగా ముంబయిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ముప్పు ఏర్పడింది. నలస పొర స్టేషన్‌ వద్ద రైళ్ళలో చిక్కుకు పోయిన ప్రయాణీకులను ఎన్‌డిఆర్‌ఎప్‌ సిబ్బంది కాపాడారు. 

దహను-బొయిసర్‌ ప్రాంతాలకు రైళ్ళు చేరుకోవడంతో అక్కడ నుండి ప్రయాణీకులను చేరవేసేందుకు డిఆర్‌డి రెండు బస్సులు ఏర్పాటు చేసింది. నగర రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో బెస్ట్‌ బస్సులు మార్గం మళ్ళి ప్రయాణించాయి. ముందు జాగ్రత్త చర్యగా నగరంలోనూ, పరిసర ప్రాంతాలలోనూ విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో దాదాపు 3 లక్షల మంది ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్గ మధ్యంలోనే నిలిచిపోయిన వదోదర ఎక్స్‌ప్రెస్‌ రైలులో చిక్కుకు పోయిన ప్రయాణీకులకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, కోస్టగార్డ్‌ బృందాలు తగిన సహాయాన్ని అందించాయి. స్నాక్స్‌ తదితర ఆహార పదార్ధాలను వారికి అందించారు. మధ్యాహ్న సమయానికి తుఫాను ఏర్పడనున్నదన్న వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. దీనిపై వాతావరణ శాఖ స్పందిస్తూ తాము ఎటువంటి తుఫానుహెచ్చరికలు జారీ చేయలేదని ప్రకటించింది.