ముంబయిని వణికిస్తున్న వర్షాలు

ముంబయిని వణికిస్తున్న వర్షాలు

  ముంబయి : గురువారం నుండి భారీగా కురుస్తున్న వర్షాల ధాటికి ముంబయి, థానేలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, శుక్ర, శనివారాలు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో వారాంతంలో ప్రజలు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికపుడు ప్రాంతీయ వాతావరణ కేంద్రం అందించే సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జూన్‌ 8 నుండి 12 వరకు అరేబియా సముద్రంలో కొంకణ్‌, గోవా తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. 

రుతుపవనాలు విస్తరించక ముందే ముంబయిలో గురువారం నుండి భారీవర్షాలు కురుస్తున్నాయని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కెఎస్‌.హోస్లికర్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు సాంటాక్రూజ్‌లో 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, కొలబా అబ్జర్వేటరీలో 27.6మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం నాలుగు గంటల నుండి 8.30 వరకు అంటే సుమారు నాలుగున్నర గంటలలో సాంటాక్రూజ్‌లో 18.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, కొలబాలో 35.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.