నాగపూర్ -హైదరాబాద్ మధ్య సెమీహైస్పీడ్ రైలు

నాగపూర్ -హైదరాబాద్ మధ్య సెమీహైస్పీడ్ రైలు

న్యూఢిల్లీ : త్వరలో రైల్వేశాఖ ప్రవేశపెట్టే సెమీ హైస్పీడ్ రైలు నాగ్‌పూర్-హైదరాబాద్ మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గించనున్నది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. రెండు నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైల్వే కారిడార్ సాధ్యాసాధ్యాలపై రష్యా రైల్వేశాఖతో కలిసి భారతీయ రైల్వే అధ్యయనం చేస్తున్నది. దీనిపై ఇప్పటికే ఓ బ్లూప్రింట్ సిద్ధమైంది. అంతా ఓకే అనుకుంటే ఈ ప్రతిపాదన రైల్వేబోర్డు ముందుకు వెళ్తుంది అని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

ఈ కొత్త సెమీ హైస్పీడ్ రైలు వాళ్ళ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి మూడు గంటల్లోనే రైలు ద్వారా హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. కనీసం 9 గంటల సమయం పట్టే ప్రయాణం మూడోవంతుకు తగ్గుతుంది. ప్రస్తుతం నాగ్‌పూర్-హైదరాబాద్ మధ్య నేరుగా విమాన సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అనుకూలంగా మలుచుకునేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తున్నది. 584 కిమీ దూరం ఉన్న ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం రైళ్లు గంటకు 60 కిమీ సగటు వేగంతో నడుస్తున్నాయి. వీటితో ఈ ప్రయాణానికి 9గంటలకు మించి సమయం పడుతున్నది. కొత్తగా ప్రవేశ పెట్టాలనుకుంటున్న సెమీ హైస్పీడ్ రైలును గంటకు 160 నుంచి 200 కిమీ వేగంతో నడిపి మూడుగంటల్లో చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళిక రూపొందిస్తున్నది.

ఇప్పటికే రద్దీగా ఉండే ఢిల్లీ-చండీగఢ్ మధ్య దేశంలోనే తొలిసారి సెమీ హైస్పీడ్ రైలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రాన్స్ సాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో గంటకు 200 కిమీవేగంతో రైలును నడుపనున్నది. అన్నీ కుదిరితే నాగ్‌పూర్-హైదరాబాద్ సెమీస్పీడ్ రైలు దేశంలో రెండవదవుతుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ (బుల్లెట్) రైలును గంటకు 250-350 కిమీ వేగంతో నడిపేందుకు జపాన్ సాయంంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.