నీటి విమానాలకు కేంద్రం పచ్చజెండా

నీటి విమానాలకు కేంద్రం పచ్చజెండా

  త్వరలో ఇక దేశంలో నీటి విమానాల సందడి మొదలు కానున్నది. మామూలు విమానాలకు ఎయిర్‌పోర్టు కట్టాలంటే పెద్దస్థలం, బోలెడు డబ్బు అవసరం. కానీ నీటి ఏరోడ్రోమ్‌లకు పెద్దపెద్ద చెరువులు లేదా నదుల వంటి నీటివ నరులు సరిపోతాయి. నీటి మీద విమానాలు దిగడం, ఎగరడం కొత్తకాదు. ప్రపంచమంతటా ఇవి ఎప్పటినుంచో ఉన్నాయి. మూరుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నీటి ఏరోడ్రోమ్‌లకు శనివారం అనుమతి మంజూరు చేసింది. కేంద్ర విమానయాన శాఖమంత్రి సురేశ్ ప్రభు ట్విట్టర్‌లో ఈ సంగతి వెల్లడించారు. ఈ విమానాలతో టూరిజం వృద్ధి చెందుతుందని, పుణ్యక్షేత్రాలకు రాకపోకలు సులభమవుతాయని ఆయన పేర్కొన్నారు. 

తొలిదశలో ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, అసోంలలో నీటి ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. తొలిదశ ప్రాజెక్టులో చిల్కా సరస్సు (ఒడిశా), సబర్మతి రివర్‌ఫ్రంట్, సర్దార్ సరోవర్ డ్యాం (రెండూ గుజరాత్‌లోనే)లను ఎంపిక చేసినట్టు కేంద్రమంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. గజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ సీప్లేన్‌లో సబర్మతి నదిలో ల్యాండ్ అయినప్పటి నుంచీ మనదేశంలో ఈ తరహా రవాణాపై ఆసక్తి పెరిగింది. పవన్‌హంస్, స్పైస్‌జెట్ వంటి సంస్థలు నీటి విమానాల కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నాయి.