ఎన్‌ఆర్‌సిపై రభస

ఎన్‌ఆర్‌సిపై రభస

 న్యూఢిల్లీ :అసోంలో ఇటీవల ప్రకటించిన జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి) జాబితాపై ఉభయసభల్లో తీవ్రమైన చర్చ జరి గింది. ప్రతిపక్షాల నిరసనలతో ఉభయ సభలు అట్టుడి కాయి. శుక్రవారం రాజ్యసభలో జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ ఆర్‌సి) అస్సాం ముసాయిదాపై చర్చ జరిగింది. ప్రభుత్వం, ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాదప్రతివాదాలు జరిగాయి. వివిధ పార్టీల సభ్యులు సంధిస్తున్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని, దానిపై అపోహలొద్దని ప్రతిపక్ష సభ్యులకు సర్దిచెప్పటానికి ప్రయత్నించారు. 

జాతీయ పౌరసత్వ జాబితా నిజాయితీ, పారదర్శకతతో కూడిన ప్రక్రియ అన్నారు. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే తాము జాబితాను రూపొందించామని తెలిపారు. ప్రతి నియమాన్ని అనుసరించామని, ఇందులో ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. ఏ భారతీయుడిని పౌర రిజిస్టర్‌లో చేర్చకుండా వదిలేయబోమని, ఈ జాబితాపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఏ భారత పౌరునిపై వివక్ష, అనవసర వేధింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు రేకెత్తించి, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నా రని ఆరోపించారు. పౌర రిజిస్టర్‌ ముసాయిదాలో పేరు లేనివారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోమని స్పష్టం చేశారు. ఒకసారి తుది జాబితా విడుదల చేసిన తరువాత కూడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అందరికీ ఉంటుందని, అది వారి హక్కని, ఆ హక్కును ఎవరూ త్రోసిప్చులేరని అన్నారు.

అంతకు ముందు ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ ఈ అంశంపై మాట్లాడుతూ, అక్రమ చొరబాట్లపై ఎవరూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అలాగని అమాయకులపై చర్యలు తీసు కోవడం తగదని అన్నారు. విశాల భారత దేశంలో నిర్ణయాలు తీసుకునేటపుడు ఆచితూచి వ్యవహ రించాలని చెప్పారు. ప్రభుత్వం భాష పేరుతో ప్రజల్ని విభజించ కూడదని అన్నారు. సిపిఎం రాజ్యసభ పక్షనేత టికె రంగరాజన్‌ మాట్లాడుతూ కులం, మతం, భాష పేరుతో ప్రజలను విభజించరాదని అన్నారు. దీనిపై రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సిపిఐ పక్షనేత డి.రాజా, అన్నాడిఎంకె ఎంపి సత్యనాథ్‌, ఎస్పీ నేత జావీద్‌ అలీఖాన్‌, ఎన్సీపి నేత మసీద్‌ మొమోన్‌, ఆర్జేడి నేత మనోజ్‌ కుమార్‌ జా టిఎంసి నేత డెరిక్‌ ఒబ్రెయిన్‌ తదితరులు మాట్లాడారు.
మరోవైపు లోక్‌సభలోనూ ఈ వివాదం చర్చకు వచ్చింది. టిఎంసి నేతలను అడ్డుకున్న ఘటనపై ఆ పార్టీ ఎంపిలు లోక్‌సభలో నిరసన చేపట్టారు. దీంతో సభ కొంతసేపు వాయిదా పడింది.