ఒకటి కంటే ఎక్కువ లిక్కర్ బాటిల్స్ తీసుకొస్తే 5ఏళ్ల జైలు

ఒకటి కంటే ఎక్కువ లిక్కర్ బాటిల్స్ తీసుకొస్తే 5ఏళ్ల జైలు

 న్యూఢిల్లీ: యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో కీలక మార్పులు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ ఏప్రిల్ 1 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో అమల్లోకి వ‌చ్చాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ నుంచి తక్కువ ధరకు మద్యం తెచ్చుకునే వారికి అడ్డుకట్ట పడింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలు నోయిడా, ఘజియాబాద్‌లో నివాసం ఉంటున్న వారు కొన్నేళ్లుగా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్సైజ్ రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో ఎక్సైజ్ చట్టం-1910 సవరణలు చేసింది. 


కొత్త నియమాల ప్రకారం ఒకసారి ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ సీల్డ్ మద్యం బాటిళ్లను తీసుకొని ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తే చట్టపరంగా చర్యలు ఎదుర్కొనున్నారు. నియమాలను ఉల్లంఘించిన వారికి 5ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా కూడా విధించనున్నారు. పొరుగు రాష్ర్టాల నుంచి మద్యం దిగుమతులను తగ్గించడానికి కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇతర రాష్ర్టాల నుంచి మద్యం రవాణా చేస్తే నాన్-బెయిలబుల్ నేరంగా కూడా పరిగణించనున్నారు. ఐతే మద్యం బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి ఉంచితే ఈ నిబంధనలు వర్తించవని చట్టంలో ఉంది. ఢిల్లీలో తక్కువ ధరకు మద్యం దొరకడంతో నోయిడా, ఘజియాబాద్‌లో నివసిస్తున్న వారు అక్కడి నుంచి లిక్కర్‌ను కొనుగోలు చేయడం అక్కడ అంతా సాధారణమే.