ఆన్‌లైన్‌ డేటాపై కేంద్ర ప్రభుత్వ నిఘా

ఆన్‌లైన్‌ డేటాపై కేంద్ర ప్రభుత్వ నిఘా

  న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా కమ్యూనికేషన్‌ హబ్‌ ఏర్పాటు కోసం కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ ఇటీవల జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌ పలు అనుమానాలకు తావిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేందుకు మోడీ సర్కారు చేస్తున్న తాజా దాడిగా ఈ ప్రయత్నాన్ని వారు అభివర్ణిస్తున్నారు. 'వివిధ అంశాలపై వివాదాలు రేకెత్తించేందుకు ప్రయత్నించే వారిని నిశితంగా పరిశీలించేందుకు అవసరమైన 360 డిగ్రీల దృక్కోణాన్ని కల్పించే 'రియల్‌ టైమ్‌ న్యూ మీడియా కమాండ్‌ రూమ్‌' ఏర్పాటుకు వేదికగా ఈ సోషల్‌ మీడియా హబ్‌ను మార్చనున్నట్లు ఈ టెండర్‌ ప్రకటనలో పేర్కొ న్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిథ పథకాలపై ప్రచారం, ప్రభుత్వ ప్రచారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లటం, పథకాల ప్రభావంపై అంచనా వేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉపయోగిస్తున్న సాంకేతిక పదబంధం, ఇతర వివరాలను పరిశీలిస్తే ప్రజలపై నిలువెత్తు నిఘా పెట్టడం తో పాటు వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారీయెత్తున సేకరించి విశ్లేషించటం ఇందులో భాగమేనని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు ఈ నిఘాలో సేకరించిన డేటాను వివిధ వ్యక్తులు లేదా గ్రూపులను టార్గెట్‌ చేసి వారి అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని వారంటున్నారు.

ప్రభుత్వ అజెండాను ఆన్‌లైన్‌ ద్వారా ప్రజల వద్దకు చేర్చే ప్రభావ వంతులను 'క్రియాశీలకం' చేయటానికి ఇది అదనమని వారు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సోషల్‌ మీడియా విశ్లేషణా పరికరాలు, విశ్లేషణా నివేదికల రూప కల్పన, సిబ్బంది నియామకాలు, ముందస్తు అంచనాలు, వ్యవస్థీకృత నిర్వహణా పరిజ్ఞానం, ప్రైవేటు డేటా సెంటర్‌ కావాలని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ జారీ చేసిన టెండర్‌ ప్రకటనలో పేర్కొన్నారు.