>

పెట్రోల్ బంకుల్లో కార్డులు బంద్‌!

పెట్రోల్ బంకుల్లో కార్డులు బంద్‌!

బెంగ‌ళూరు: దేశ‌వ్యాప్తంగా సోమ‌వారం నుంచి పెట్రోల్ బంకుల్లో డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌ని పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణ‌యించింది. కార్డు ద్వారా జ‌రిపే ప్ర‌తి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డ‌మే దీనికి కార‌ణం.దీనికి నిర‌స‌న‌గానే సోమ‌వారం నుంచి కార్డుల‌ను అంగీక‌రించ‌డం లేద‌ని, కేవ‌లం న‌గ‌దునే అంగీక‌రిస్తామ‌ని అఖిల క‌ర్ణాట‌క ఫెడ‌రేష‌న్ ఆఫ్ పెట్రోలియ‌మ్ అధ్య‌క్షుడు బీఆర్ ర‌వీంద్ర‌నాథ్ స్ప‌ష్టంచేశారు.కార్డుల ద్వారా పెట్రోల్ పోయించుకుంటే 0.75 శాతం క్యాష్‌బ్యాక్ అన్న ప్ర‌భుత్వ ఆఫ‌ర్‌తో ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌లు భారీగా కార్డుల వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో పెట్రోల్ బంకులు వాటిని అంగీక‌రించ‌మంటే మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు. దీనిపై రవీంద్ర‌నాథ్ స్పందిస్తూ.. బ్యాంకులే దీనికి కార‌ణ‌మ‌ని, వాళ్లు ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) త‌మ నెట్ ప్రాఫిట్‌ను 0.3 శాతం నుంచి 0.5 శాతంగా నిర్ణ‌యించాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో బ్యాంకులు ఒక శాతం చార్జీ విధిస్తే మా ప‌రిస్థితి ఏంటి అని ర‌వీంద్ర‌నాథ్ ప్ర‌శ్నించారు. ఈ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల్సిన ఓఎంసీలు త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని, అందుకే అస‌లు కార్డులు తీసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.


Loading...