ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్రియాంకా గాంధీ

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్రియాంకా గాంధీ

 న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంకా గాంధీ వ‌ద్రా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయ్యారు. సోనియా-రాజీవ్ కూతురు ప్రియాంకా గాంధీ ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. తూర్పు యూపీలో.. కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్రియాంకా నియ‌మితుల‌య్యారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు రాహుల్‌.. ఓ మంచి స్ట్రాట‌జీ అమ‌లు చేశార‌ని కొంద‌రు పార్టీ సీనియ‌ర్లు అంటున్నారు.

చాన్నాళ్లుగా జ‌రుగుతున్న ఊహాగానాల‌కు కాంగ్రెస్ పార్టీ తెర‌దించింది. ప్రియాంకా గాంధీ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆకాంక్ష‌లు నిజంకానున్నాయి. యూపీ ఈస్ట్‌లో ఎన్నిక‌ల స‌మ‌రానికి చెల్లెలు ప్రియాంకాను రాహుల్ రంగంలోకి దించేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజ‌క‌వ‌ర్గం గోర‌ఖ్‌పూర్ కూడా తూర్పు యూపీలోనే ఉంటుంది. దీంతో ఇక యూపీ ఎన్నిక‌ల భేరీ ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్న‌ది. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డంలో ప్రియాంకా గాంధీ కొంత పాత్ర పోషించిన‌ట్లు తెలుస్తోంది. అయితే వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు మాత్ర‌మే ఆమె ఇక త‌న స‌హ‌జ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. 

ఫిబ్ర‌వ‌రిలో ప్రియాంకా త‌న బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే కొత్త‌గా ఇంచార్జ్ హోదాకు నియ‌మితులైన ప్రియాంకాకు అన్ని వ‌ర్గాల నుంచి కంగ్రాట్స్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ త‌న ట్విట్ట‌ర్‌లో ప్రియాంకాకు విషెస్ చెప్పింది. అయితే యూపీ వెస్ట్‌కు సీనియ‌ర్ లీడ‌ర్ జ్యోతిరాధిత్య సింథియాను ఇంచార్జ్‌గా నియ‌మించారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 80 సీట్లు ఉన్న యూపీ రాష్ట్రం కీల‌కం కావ‌డం వ‌ల్ల ఆ రాష్ట్రంపై అప్పుడే కాంగ్రెస్ పార్టీ స‌మ‌ర‌శంఖం పూరించిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ 73 సీట్లు గెలిచిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ఎన్నిక‌ల్లో రెండు సీట్లును మాత్ర‌మే కైవ‌సం చేసుకున్న‌ది. రాయ్‌బ‌రేలీ, అమేథీలో త‌ల్లీకొడుకులు సోనియా, రాహుల్ మాత్ర‌మే గెలిచారు.