రాహుల్‌పై పరువు నష్టం దావా

రాహుల్‌పై పరువు నష్టం దావా

  భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ కుమారుడు కార్తికేయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై పరువు నష్టం దావా కేసు వేశారు. నిన్న జరిగిన ఎన్నికల సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ పనామా పత్రాల్లో చౌహన్‌ కుమారుడి పేరు ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారమే రేగింది. ఈ నేపథ్యంలోనే తన పేరును అనవసరంగా ప్రస్తావించారని ఆరోపిస్తూ కార్తికేయ రాహుల్‌పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ విచారణను నవంబరు 3న చేపట్టనున్నారు. ఒకవేళ ఇప్పుడు రాహుల్‌ క్షమాపణలు చెప్పాలనుకున్నా అది కోర్టు ఎదుటే చెప్పాలని కార్తికేయ తరఫు న్యాయవాది తెలిపారు.

  సోమవారం జబువాలో జరిగిన ర్యాలీలో రాహుల్‌ ప్రసంగిస్తూ పనామా పత్రాల కుంభకోణంలో కార్తికేయ పేరు ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. దీనిపై రాహుల్‌ స్పందించారు. ‘భాజపాలో అవినీతి ఎక్కువ కదా అందుకే నేను పొరపడ్డాను’ అంటూ రాహుల్‌ చురకలంటించారు.