రాళ్లతో ఒకరినొకరు కొట్టుకోవడమే ఇక్కడ పండుగ...

రాళ్లతో ఒకరినొకరు కొట్టుకోవడమే ఇక్కడ పండుగ...

  హిమాచల్‌ప్రదేశ్: దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో గ్రామస్థులు కర్రలతో కొట్టుకుంటూ బన్ని ఉత్సవాన్ని జరుపుకోవడం మనం చూశాం. ఇలాంటిదే మరో ఉత్సవం దీపావళి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్నది. రాజధాని షిమ్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధామిలో స్థానికులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకుంటారు. ధామి రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా ఇందులో పాల్గొంటారు. 400 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం. ధామి రాణి త్యాగానికి గుర్తుగా గ్రామస్థులు ఈ వేడుకను జరుపుకుంటారు. బలిదానాలను ఆపాలంటూ ధామి మాజీ రాణి ప్రాణత్యాగం చేసినట్లు ఇక్కడి వాళ్లు చెబుతారు.

దీనికి బదులుగా ఓ వేడుక నిర్వహించాలని, అందులో రెండు వంశాల వాళ్లు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకొని, ఎవరో ఒకరు గాయపడితే వాళ్ల రక్తాన్ని కాళీ మాతకు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. ధామి మాజీ రాజు నిర్మించిన గుడి నుంచి పండుగ రోజు భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండు వంశాలకు చెందిన వందల మంది అక్కడ గుమిగూడి ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకుంటారు. 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించారు.