>

రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గిన ఓటు విలువ

రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గిన ఓటు విలువ

 న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా నిర్ణయించడం అశాస్త్రీయమని టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్ కుమార్ కేంద్ర ఎన్నిల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 148 గా ఉన్న ఎమ్మెల్యే ఓటు విలువను రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువను 159గా, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువను 132గా నిర్ణయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి.. రాజ్యాంగంలోని 52(2) నిబంధన ప్రకారం 1971 జనాభా లెక్కలు ప్రాతిపదికగా ఎమ్మెల్యేల ఓటు విలువ, దాని ప్రకారం ఎంపీ ఓటు విలువ ఖరారు చేస్తున్నారు. 

అయితే 1971 జనాభా లెక్కల తర్వాత నాలుగుసార్లు జనాభా లెక్కలు సేకరించినా, రాజ్యాంగం ప్రకారం 1971 లెక్కలనే ప్రామాణికంగా తీసుకోవడంతో తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువకు తగిన న్యాయం జరుగలేదు. రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 55(2) నిబంధనను సవరించినట్టయితే అన్ని రాష్ర్టాలకు సరైన న్యాయం జరిగి ఉండేదని, కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓటు విలువను నిష్పత్తి ప్రకారం లేదా సగటు ప్రకారం విభజించినా సహేతుకంగా, శాస్త్రీయంగా ఉండేదని ఆ లేఖలో వినోద్ పేర్కొన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభా 55,93,02,005 (లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన పార్లమెంటు బులెటిన్ ప్రకారం). 

కానీ కేంద్ర సెన్సస్ విభాగం ప్రకారం ఇది 54,81,60,050గా ఉంది. దేశ జనాభా 2011 లెక్కల ప్రకారం 1971తో పోల్చితే రెండు రెట్లకంటే ఎక్కువే పెరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తున్నది (రిటర్నింగ్ అధికారి) లోక్‌సభ సెక్రటరీ జనరల్ కాబట్టి బులెటిన్‌లోని గణాంకాలే ప్రామాణికం. ఈ బులెటిన్ ప్రకారం 1971లో ఉమ్మడి రాష్ట్ర జనాభా 4,35,02,708. ఇందులో తెలంగాణ ప్రాంతంలో 1,57,02,122, ఆంధ్ర ప్రాంతంలో 2,78,00,586 మంది నివసిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారమే లోక్‌సభ సెక్రటరీ జనరల్ తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువను 132గా, ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువను 159గా ఖరారు చేశారు. రెండు రాష్ర్టాల మధ్య 27 ఓట్ల తేడా ఉంది.

ఈ తేడాను రెండు రాష్ర్టాల మధ్య సమంగా పంచినట్లయితే సమంజసంగా ఉండేది. వాజ్‌పేయీ హయాంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఈ కొత్త రాష్ర్టాల్లోని ఎమ్మెల్యేల ఓటు విలువను పరిశీలిస్తే ఇంత ఎక్కువ తేడా కనిపించదు. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ (1971 జనాభా లెక్కల ప్రకారం) 131గా ఉంటే దీని నుంచి ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే ఓటు విలువ 129గా (తేడా 2శాతం) ఖరారైంది. బీహార్ ఎమ్మెల్యే ఓటు విలువ 173 కాగా, దీన్నుంచి ఏర్పడిన జార్ఖండ్ ఎమ్మెల్యే ఓటు విలువ 176 అయింది. ఉత్తరాఖండ్ విషయంలో మాత్రం జనాభా లెక్కల్లో తేడా కారణంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, ఉత్తరాఖండ్‌లో ఇది 64 మాత్రమే.


Loading...