సైనికాధికారుల ‘మానవ హక్కుల ఉల్లంఘన’

సైనికాధికారుల ‘మానవ హక్కుల ఉల్లంఘన’

 న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో సైన్యం, సైనికాధికారులు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపి నివేదిక అందచేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ రక్షణ మంత్రిత్వశాఖను కోరింది. సైనికాధికారుల పిల్లలు ముగ్గురు దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి ఈ మేరకు రక్షణశాఖకు లేఖ రాసింది. గత నెల 27న షోపియాన్‌లో జరిగిన ఘటనను ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు. 

ఆ సమయంలో సైనిక వాహనాల కాన్వారుపై కొంతమంది వ్యక్తులు రాళ్లు రువ్వటంతో సైన్యం ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిగిందని, ఈ ఘటనలు ముగ్గురు పౌరులు మరణించారని వార్తలు వెలువడ్డాయి. ఈ ఘర్షణలో తమ సిబ్బంది ఏడుగురు గాయపడ్డారని, 11 వాహనాలు ధ్వంసమయ్యాయని సైన్యం ఒక ప్రకటనలో వివరించింది. ఈ ఘటనలో జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని ఫిర్యాదీలు కోరినందున తాము దీనిపై నివేదిక కోరుతున్నామని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఒక ప్రకటనలో వివరించింది. ఈ దాడులు, ప్రతిదాడులతో చిన్నారులు తీవ్ర కలవరపాటుకు గురయ్యారని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. దీనిపై నాలుగు వారాల్లో తమకు నివేదిక అందించాలని రక్షణశాఖ కార్యదర్శిని కమిషన్‌ కోరింది.