సల్మాన్‌కు ఐదేండ్ల జైలు

సల్మాన్‌కు ఐదేండ్ల జైలు

  జోధ్‌పూర్ : బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం ఐదేండ్ల జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న బాలీవుడ్ తారలు టబు, సోనాలిబింద్రే, సైఫ్‌అలీఖాన్, నీలమ్ కొఠారితోపాటు దుష్యంత్‌సింగ్, దినేష్ గౌరే అనే స్థానికులను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో ఓ సినిమా చిత్రీకరణ కోసం జోధ్‌పూర్ వెళ్లిన సల్మాన్ కొందరు సహచర నటులతో కలిసి కృష్ణజింకలను వేటాడారు. ఈ కేసులో 20 ఏండ్ల తర్వాత న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గరిష్ఠంగా ఆరేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉండగా, ఐదేండ్ల జైలుశిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. 

తీర్పు వెలువడిన వెంటనే 52 ఏండ్ల సల్మాన్‌ను పోలీసులు జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో గత నెల 28న తుదివాదనలు ముగియడంతో జోధ్‌పూర్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ ఖత్రి తీర్పును రిజర్వ్‌చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని సెక్షన్ 9/51 ప్రకారం సల్మాన్‌ను న్యాయస్థానం గురువారం దోషిగా తేల్చింది. జింకలను క్రూరంగా వేటాడిన సల్మాన్‌కు గరిష్ఠ శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహిపాల్ బిష్ణోయ్ వాదనలు వినిపించారు. సల్మాన్‌కు ఐదేండ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధి స్తూ న్యాయమూర్తి ఖత్రి తీర్పును ప్రకటించారు. తీర్పు వెలువడిన సమయంలో నటీనటుల కుటుంబసభ్యులు కూడా కోర్టులో ఉన్నారు.