సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహావిష్కరణ

సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహావిష్కరణ

 కేవడియా : భారతదేశ ప్రప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే హెలికాప్టర్ల నుంచి పటేల్ విగ్రహంపై పూల వర్షం కురిసింది. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మెడలో విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా భారీ పూల దండ వేసిన వీడియోను ప్లే చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని182 మీట‌ర్ల ఎత్తులో త‌యారు చేశారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విగ్రహంగా దీన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గుజరాత్‌లో నర్మదానది తీరాన నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం ఇది. పాదాలను నేలపై మోపి.. మేఘాల్లోకి తలెత్తి.. తాను కలలుగన్న భారతావనిని పరికిస్తున్నట్లు ఉండే పటేల్ విగ్రహాన్ని కేవలం 36 నెలల కాలంలో నిర్మించారు. నిర్మాణ వేగం, నాణ్యత, భారీతనంతో కూడిన ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమే కాకుండా, దేశీయ సాంకేతికత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పనుంది. 182మీటర్ల (దాదాపు 600 అడుగులు) ఎత్తుతో రూపొందించిన ఐక్యతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహంగా నిలుస్తున్నది. ఎల్‌అండ్ టీ సంస్థ దీన్ని 33 నెలల్లోనే పూర్తిచేసింది. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద విగ్రహంగా ఉన్న స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం ఉండగా, దాని నిర్మాణానికి చైనాకు 11 సంవత్సరాల సమయం పట్టింది.

విగ్రహం ఎత్తు : 182 మీటర్లు
* (25 మీటర్ల పీఠంతోపాటు) అంటే, సుమారు 600 అడుగుల ఎత్తు. నదీమార్గం నుంచి అయితే ఈ ఎత్తు మరో 26.5మీటర్లు అదనం. 
* 5.6 అడుగుల ఎత్తు ఉండే ఓ సగటు వ్యక్తి కన్నా ఇది వందరెట్లు ఎక్కువ ఎత్తయిన విగ్రహం
* న్యూయార్క్ (అమెరికా) లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కన్నా పటేల్ విగ్రహం ఎత్తు రెండురెట్లు ఎక్కువ. 

* 70 వేల టన్నుల సిమెంట్, 18,500 టన్నుల బరువైన ఉక్కు, 6,500వేల టన్నుల నిర్మాణ ఉక్కు, రెండువేల మెట్రిక్ టన్నుల కంచుతో విగ్రహాన్ని రూపొందించారు. 
* ఉపయోగించిన కాంక్రీట్- లక్షా40వేల క్యూబిక్ మీటర్లు 
* 135 మెట్రిక్ టన్నుల ఇనుమును ప్రజల నుంచి సేకరించారు. దీన్ని కూడా విగ్రహ తయారీలో వాడారు.
* నిర్మాణానికి శ్రమించిన కార్మికులు 3000
* నోయిడాకు చెందిన శిల్పి రామ్‌సుతార్ విగ్రహాన్ని డిజైన్ చేశారు. 
* నర్మదా నది మధ్యలో భారీ విగ్రహాన్ని నిర్మించడం ఒక సవాల్‌కాగా, అది నిలబడిన తరహాలో నిర్మించడం మరో చాలెంజ్.
గంటకు 180 కి.మీ. వేగంతో వీచే గాలులను, రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో కూడిన భూకంపాన్ని తట్టుకునేలా విగ్రహాన్ని నిర్మించారు.
* పటేల్‌కు సంబంధించిన సుమారు 2,000 ఫొటోలను పరిశీలించిన తర్వాతే విగ్రహం ముఖానికి తుదిరూపునిచ్చారు. సర్దార్‌ను ప్రత్యక్షచూసిన వారిని కూడా సంప్రదించారు.
* రెండు హైస్పీడ్ ఎలివేటర్లు ప్రయాణికులను విగ్రహం లోపలి గుండా పైభాగానికి తీసుకెళ్తాయి. పటేల్ విగ్రహం ఛాతి భాగం వరకు వెళ్లి అక్కడి గ్యాలరీ నుంచి భూమ్మీది అందాలను చూడొచ్చు. 200 మంది పర్యాటకులు ఒకేసారి తిలకించేంత పెద్దదిగా ఆ గ్యాలరీని నిర్మించారు.