సరిహద్దులో ఐదుగురు ఉగ్రవాదుల హతం

సరిహద్దులో ఐదుగురు ఉగ్రవాదుల హతం

   శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని థాంగ్‌ధార్‌ సెక్టార్‌లోని సరిహద్దుల్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదులు చొరబడుతుండగా శనివారం వారిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఇంకా భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. రంజాన్‌ మాసం సందర్భంగా సరిహద్దులో శాంతిని నెలకొల్పాలని, చొరబాట్లను ఆపాలని కోరుతూ ఆర్మీ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

తాము సరిహద్దుల వద్ద శాంతిని కోరుకుంటుంటే పాకిస్తాన్‌ నిరంతరం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఇందవల్ల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోందని, తాము అనివార్యంగా తాము ఎదురుకాల్పులకు దిగాల్సి వస్తుందని రావత్‌ పేర్కొన్నారు. ఒకవేళ పాకిస్తాన్‌ శాంతి కోరుకుంటే, చొరబాట్లను ఆపాలని కోరారు. రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా జమ్ము కాశ్మీర్‌లోని ఉగ్రవాదులపై భద్రతాదళాలు కాల్పులను విరమించుకోవాలని కేంద్రం ఆదేశించింది. అయితే ప్రాణ నష్టం వాటిల్లుతున్నప్పుడు, పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ఎదురుకాల్పులకు చేయవచ్చునని సూచించింది.