సెక్షన్‌ 377 నేరం కాదు : సుప్రీంకోర్టు

సెక్షన్‌ 377 నేరం కాదు : సుప్రీంకోర్టు

  న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం (హోమోసెక్సువాలిటీ) పై సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. గే సెక్స్‌ నేరం కాదని స్పష్టం చేస్తూ, స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. స్వలింగసంపర్కం నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతిలోని (ఐపిసి) సెక్షన్‌ 377పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్‌ను రద్దు చేయడం ద్వారా ఎల్జిబిటి (లెస్బియన్‌-గే-బైసెక్సువల్‌-ట్రాన్స్‌జెండర్‌) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ కన్విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన బెంచ్‌ ఈ తీర్పు వెలువరించింది. 

స్వజాతి లైంగిక చర్య నేరం కాదని తాజా తీర్పులో పేర్కొంటూ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అని, స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో సెక్షన్‌ 377పై సుదీర్ఘం కాలంగా సాగుతున్న వివాదానికి స్వస్తి పలికినట్లైంది. కాగా, సెక్షన్‌ 377ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడంతో ఎల్‌జిబిటి హక్కుల కోసం పోరాడుతున్న పలువురు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఒక కొత్త శకానికి ఇది నాంది అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ సెక్షన్‌పై భరతనాట్యం డాన్సర్‌ నవతేజ్‌ జౌహార్‌, జర్నలిస్ట్‌ సునీల్‌ మెహ్రా, చీఫ్‌ రీతు దల్‌మారు, అమన్‌నాథ్‌, కేశవ్‌ సూరి, వ్యాపార వేత్త అయేషా కపూర్‌లు పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.