షిల్లాంగ్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ

షిల్లాంగ్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ

 షిల్లాంగ్‌ : మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో శాంతి భద్రల పరిరక్షణకు విధిస్తున్న కర్ఫ్యూను సాయంత్రం నాలుగు గంటల నుండి మంగళవారం ఉదయం ఐదు గంటల వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నాలుగు అదనపు సిఆర్‌పిఎఫ్‌, బిఎస్‌ఎఫ్‌ బలగాల సంయుక్త బృందాన్ని షిల్లాంగ్‌కు పంపించారని, సంక్షోభాన్ని నియంత్రించడంలో సహాయపడేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. 

షిల్లాంగ్‌ నగరంతో పాటు లుమ్డియంగ్జీ పోలీస్‌ స్టేషన్‌, కంటోన్మెంట్‌ బీట్‌ హౌస్‌ ప్రాంతాల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్నట్లు తెలిపారు. కర్ఫ్యూను సడలించడంపై అధికారులతో చర్చించిన అనంతరం వెల్లడిస్తామని ఈస్ట్‌ ఖాసీ హిల్స్‌ డిప్యూటికమిషనర్‌ వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్థితిపై మేఘాలయ ప్రభుతం నుండి ఎటువంటి నివేదికలు కోరలేదని తెలిపింది. గతవారం షిల్లాంగ్‌లో పంజాబీ లైన్‌ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఖాసికి చెందిన బస్‌ కండెక్టర్‌పై దాడి చేశారన్న ఆరోపణతో మొదలైన ఘర్షణలు నిన్న రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆప్రాంతమంతా ప్రతిష్టంభన నెలకొంది. సోమవారం భారత్‌ ఆర్మీ బృందం నగరంలో ర్యాలీ చేపట్టినట్లు సిఆర్‌పిఎఫ్‌ ఐజి తెలిపారు. 

కాగా, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ సంగ్మా మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు నగరంలో శాంతికి విఘ్నం కలిగించేందకు ఆందోళనకారులకు మందు, నగదు పంపిణీ చేస్తున్నారని, అందుకు సాక్ష్యాధారాలు లభించాయని అన్నారు. ఈ ఘర్షణలు మతానికి చెందినవి కావని, ఒక ప్రాంతానికి చెందినవి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అలాగే నగదు ఎక్కడి నుండి వస్తుందనే విషయంపై విచారణ చేపట్టామని ఆయన మీడియాకు తెలిపారు.

నిరసనలలో పాల్గొన్న ప్రజలు ఆ ప్రాంతానికి చెందినవారు కాదని, షిల్లాంగ్‌ ఫాల్స్‌లోని తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లా నుండి వచ్చారని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్‌ మంత్రి సుఖీందర్‌ రాండ్వాతో కూడిన నలుగురు సభ్యుల బృందాన్ని షిల్లాంగ్‌కు పంపుతున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలలో పరిస్థితిని అంచనా వేయడానికి, సిక్కు కమ్యూనిటీకి సహాయం అందించడానికి ఈ బృందం ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. అకాలీదళ్‌ బృందం షిల్లాంగ్‌లో పర్యటించిన అనంతరం మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాతో సమావేశమయ్యారు.