సిమ్లాలో రైతుల అసెంబ్లీ ముట్టడి

సిమ్లాలో రైతుల అసెంబ్లీ ముట్టడి

  సిమ్లా : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హిమాచల్‌ప్రదేశ్‌లో రైతులు ఆందోళనబాట పట్టారు. సిమ్లాలో అసెంబ్లీని ముట్టడించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అసెంబ్లీ వరకూ ర్యాలీ నిర్వహించిన రైతులు.. ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయ భూముల నుంచి రైతులను ఖాళీ చేయించే ప్రక్రియను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలనీ, పంటకు కనీస మద్దతు ధర కల్పించాలనీ, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలనీ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది మంగళవారం ఈ ర్యాలీ నిర్వహించారు. 'అటవీ జంతువులు, ముఖ్యంగా కోతులు, వీధుల్లో తిరిగే పశువులు పంటలను నాశనం చేస్తున్నాయి. 

వీటి నుంచి రక్షణకు శాశ్వత పరిష్కారమార్గాలను ప్రభుత్వం ఏర్పాటుచేయలి' అని కిసాన్‌ సభ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే రాకేశ్‌ సింఘా డిమాండ్‌ చేశారు. పాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. లీటరుకు రూ. 16 నుంచి 17 రైతులను లభిస్తున్నది. రాష్ట్రంలో బాటిల్‌ వాటర్‌ లీటరుకు రూ. 25కు అమ్ముతున్నారని రాకేశ్‌ సింఘా విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు రైతు సమస్యల పరిష్కారానికి చేసింది శూన్యమని చెప్పారు. భారీ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జైరామ్‌ ఠాకూర్‌ ప్రభుత్వం వాటిని నెరవేర్చేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. మోడీ ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కరించకుండా.. కుల, మత ప్రాతిపదికన ప్రజలను చీల్చే కుట్ర చేస్తున్నదనీ ఈ ర్యాలీలో పాల్గొన్న ఏఐకేఎస్‌ నేత బిజూ క్రిష్ణన్‌ విమర్శించారు. రైతుల ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ మద్దతు ప్రకటించాయి.