>

సుప్రీంకోర్టు నిర్ణయంపై తన నిరసన తెలిపిన చేతన్ భగత్

సుప్రీంకోర్టు నిర్ణయంపై తన నిరసన తెలిపిన చేతన్ భగత్

న్యూఢిల్లీ: దీపావళికి పటాకులు అమ్మొద్దంటూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చర్చనియంసంగా మారింది. సుప్రీం కోర్టు పటాకుల అమ్మకాలపై  విధించిన నిషేధంపై ట్విట్టర్‌లో అగ్గి రాచుకుంటుంది. తాజాగా ప్రముఖ రచయిత చేతన్ భగత్ కూడా దీనిపై తన నిరసనను తెలిపాడు. పటాకుల అమ్మకం నిషేధాన్ని సమర్థిస్తున్నవారికి ట్విట్టర్‌లో కొన్ని సూటి ప్రశ్నలు వేశారు.

 హిందూ మతానికి చెందిన పండగలపైనేనా మీ ప్రతాపం... మొహర్రం రోజు జరిగే రక్తపాతాన్ని ఆపే దమ్ముందా అంటూ ప్రశ్నించాడు. పటాకులపై నిషేధం అంటే క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ ట్రీలు, బక్రీదు సమయంలో గొర్రెల బలిపై నిషేధించినట్లు ఉందని, ఏదైనా నియంత్రించండి తప్ప నిషేధం వద్దని సూచించాడు. కొందరు దీనికి మద్దతుగా చేసిన ట్వీట్లకు కూడా చేతన్ సమాధానమిచ్చాడు.

మీకు కాలుష్య నియంత్రణపై అంత శ్రద్ధ ఉంటే కార్లు వాడకండి, ఓ వారం రోజులు ఇంట్లో కరెంటు వాడకండి...అంతేగానీ ఏడాదిలో ఒక్క రోజు జరిగే దీపావళి పండుగ వల్లే కాలుష్యం పెరిగిపోతుందని ఎలా అంటారు అని నిలదీశాడు. అతని సూటి ప్రశ్నలతో ట్విట్టర్‌లో పటాకుల నిషేధంపై చర్చ మరింత రాజుకుంది. దేశ రాజధానిలో కాలుష్యం పెరిగిపోతున్నదంటూ ఈ ఏడాది దీపావళికి పటాకుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే.