సర్జికల్‌ దాడులను ‘రాజకీయం’ చేశారు

సర్జికల్‌ దాడులను ‘రాజకీయం’ చేశారు

  జైపూర్‌ : సర్జికల్‌ దాడులను ప్రధాని మోడీ 'రాజకీయం' చేశారని, తన స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. యువతకు ఉపాథి అవకాశాలు కల్పించడంలో విఫలమైన ఆయన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు 2016లో నియంత్రణ రేఖ వెంబడి సైనిక దళాలు జరిపిన సర్జికల్‌ దాడులను అడ్డు పెట్టుకున్నారని అన్నారు. రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ యుపిఎ హయాంలో రూ.2 లక్షల కోట్లుగా ఉన్న నిరర్థక ఆస్తులు ఇప్పుడు రూ.12 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. ''ప్రభుత్వం కేవలం 15 నుండి 20 మంది పారిశ్రామిక వేత్తల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. 

బ్యాకింగ్‌ వ్యవస్థ వారిపైనే దృష్టి కేంద్రీకరించింది. నిరర్థక ఆస్తులు పెరిగేందుకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారస్తులు, డాక్టర్లు, లాయర్ల కారణం కాదు'' అని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ హయాంలోనే కాకుండా అంతకుముందు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో కూడా సర్జికల్‌ దాడులు జరిగినట్లు రాహుల్‌ తెలిపారు. వాటి గురించి మీకు తెలుసా? అని ప్రశ్నించారు. కొన్నికారణాల రీత్యా వాటిని అత్యంత రహస్యంగా ఉంచాల్సి వచ్చిందన్నారు. అప్పట్లో బిజెపి ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా సర్జికల్‌ దాడులను బహిరంగ పరిచిందని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి ప్రజలను గందరగోళ పరిచాయన్నారు. ''బడా కంపెనీలకు తలుపులు బార్లా తెరిచేందుకు జరిపిన స్కామ్‌ ఇది.

పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి రైతుల నడ్డి విరిచాయి'' అని రాహుల్‌ విమర్శించారు. డేటా ప్రైవసీ గురించి ప్రస్తావిస్తూ భారత్‌, చైనాలు విస్తృతమైన డేటా కలిగి ఉన్న విషయం ఐటి కంపెనీలు అర్థం చేసుకున్నాయన్నారు డేటా ప్రజల వద్దే ఉండాలి కాని ఆశ్రిత పెట్టుబడిదారుల వద్ద కాదన్నది తన అభిప్రాయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకంపై మాట్లాడుతూ, ఆ పథకం కింద మంచి ఆసుపత్రులే లేవన్నారు. ప్రజారోగ్యం, విద్యా రంగాలపై డబ్బు వెచ్చించకుండా దేశాన్ని ముందుకు నడిపించలేమన్నారు.