‘స్వచ్ఛ్’ బుక్‌లెట్‌పై పాకిస్థాన్ అమ్మాయి ఫోటో..!

‘స్వచ్ఛ్’ బుక్‌లెట్‌పై పాకిస్థాన్ అమ్మాయి ఫోటో..!

  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ స్వచ్ఛ్ భారత్. దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి రాష్ర్టాలు స్వచ్ఛ్ భారత్‌ను అమలు చేస్తున్నాయి. ఇలాగే బీహార్‌లో కూడా స్వచ్ఛ్ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల్లో స్వచ్ఛ్ భారత్‌పై చైతన్యం తీసుకురావడానికి జముయ్ జిల్లా యంత్రాంగం 'స్వచ్ఛ్ జముయ్ స్వస్త్ జముయ్' అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దాని కోసం ఓ బ్రాండ్ అంబాసిడర్‌ను అధికారులు ఎంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి స్వచ్ఛ్ జముయ్ కి సంబంధించిన సమాచారంతో కూడిన 5000 బుక్‌లెట్లను ముద్రించారు. అంతవరకు బాగానే ఉంది కాని.. ఒక విషయంలో మాత్రం అడ్డంగా బుక్కయిపోయారు. 


అయితే.. ముద్రించిన 5000 బుక్‌లెట్ల కవర్ ఫోటోలో ఓ పాకిస్థాన్ అమ్మాయి ఫోటోను పెట్టారు. ఆ అమ్మాయి చిరునవ్వు చిందిస్తూ పాకిస్థాన్ జెండా పట్టుకున్నట్లుగా ఉంటుంది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాదాలకు దారి తీసింది. ఆ అమ్మాయి గురించి ఆరా తీయగా.. యూనిసెఫ్ తరుపున పాకిస్థాన్‌లో విద్యను ప్రమోట్ చేయడానికి ఆ అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. అదే అమ్మాయి ఫోటోతో ముద్రించిన బుక్‌లెట్లు, నోట్‌బుక్స్‌ను జముయ్ జిల్లాలోని పలు స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లు, కస్తూర్భా స్కూళ్లలో పంచారు. 

ఈ పుస్తకాలన్నీ పాట్నాలోని సుప్రభ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింట్ అయ్యాయట. అయితే.. ఆ అమ్మాయి ఫోటోను ప్రింట్ చేసే ముందే జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకున్నామని ప్రెస్ సిబ్బంది తెలిపారు. అయితే.. ఇంత బ్లండర్ మిస్టేక్ మాత్రం ఎలా జరిగిందని తెలుసుకోవడం కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించారట. అయితే.. ఈ పుస్తకాలన్నీ గత సంవత్సరమే ప్రింట్ అయినా.. రీసెంట్‌గా స్కూల్ పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఈ విషయం బయటపడింది.