తమిళనాడులో భారీ వర్షాలు

 తమిళనాడులో భారీ వర్షాలు

  హైదరాబాద్‌: తమిళనాడులో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు తీర ప్రాంత జిల్లాలు, దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. ప్రధానంగా తేని, దిండిగల్‌, కోయంబత్తూరు, అరియలూరు, తంజావూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోబిచెట్టిపాలయం, పొల్లాచ్చి, అరియలూరు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తటంతో దాదాపు 15 గ్రామాలు జలమయం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.

బాధిత ప్రాంతాల్లో మంత్రి సెంగొట్టయ్యన్‌ పర్యటించి సహాయ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.  పుదుచ్చేరిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక చైన్నై శివారు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో అధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.రుతుపవనాల కారణంగా మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

మరోవైపు డెంగ్యూ, స్వైన్‌ప్లూ వ్యాధులు విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనల నడుమ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక భారీ వర్ష సూచనల నడుమ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని, తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే పొల్లాచ్చి, గోపిచెట్టి పాలయం తదితర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.