తమిళనాడుకు తుఫాన్‌ హెచ్చరిక

తమిళనాడుకు తుఫాన్‌ హెచ్చరిక

  చెన్నై : ఆగేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రతరమై శుక్రవారం వాయుగుండంగా మారడంతో ఈ నెల 7న తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతారవణ కేంద్రం 'రెడ్‌ అలర్ట్‌' జారీ చేసింది. 'కలర్‌ కోడ్‌'తో కూడిన హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. దీనిపై చెన్నైలోని వాతావరణ కేంద్రం డిప్యూటి డైరెక్టర్‌జనరల్‌ ఎస్‌. బాలచంద్రన్‌ వివరణ ఇస్తూ ఎటువంటి చర్యలు తీసుకోవలసిన అవసరం లేని ప్రాంతాలలో గ్రీన్‌ హెచ్చరికను, 7 నుండి 12 సెంమీ.మధ్య భారీ వర్షాలు కురిసే ప్రాంతాలను సూచించేలా పసుపుపచ్చ రంగు హెచ్చరికను, తీవ్రమైన భారీ వర్షాలను అంటే 12.4 నుండి 24.4 సెంమీ. వరకు వర్షాలు కురిసే ప్రాంతాలకు ఆరెంజ్‌ రంగు హెచ్చరికను, 24.4 సెంమీ మించి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలలో రెడ్‌ అలర్ట్‌ను(పునరావాస చర్యలు తీసుకోవలసిన ప్రాంతాలు) ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 

అరేబియా మహా సముద్రం లో ఏర్పడిన వాయుగుండం కారణంగా చెన్నై, కాంచీపురం, నాగపట్టణం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, తిరువల్లూరు, విల్లుపురం, పెరంబలూరు, నమక్కల్‌, ధర్మపురి జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురియనున్నట్లు తెలిపింది. తిరుచ్చి, సేలం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురియనున్నాయని, అదేవిధంగా తమిళనాడులోని దక్షిణ ప్రాంతం, పశ్చిమ కనుమలలోని నీలగిరులు, థేని, దిండిగల్‌ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలలోని వివిధ ప్రాంతాలలో ఈ నెల 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నైలో కూడా ఆదివారం వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురియనున్నాయని పేర్కొంది.