త్వరలో పతంజలి జీన్స్...

త్వరలో పతంజలి జీన్స్...

 న్యూఢిల్లీ: ఐదేళ్లలో యాభై నుంచి ఏకంగా వెయ్యికి పైగా కన్జ్యూమర్ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన పతంజలి ఆయుర్వేద్ సంస్థ గార్మెంట్స్ విభాగంలోకి అడుగుపెట్టబోతుంది. తమ సంస్థ వచ్చే ఏడాది దుస్తుల తయారీ విభాగంలోకి ప్రవేశించనుందని యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు. మార్కెట్లోకి మీ కంపెనీకి చెందిన జీన్స్ ఎప్పుడు తీసుకొస్తున్నారు? అని కొంతమంది ప్రజలు నన్ను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో గార్మెంట్ ఉత్పత్తులను లాంచ్ చేయాలని నిర్ణయించాం.

వీటిలో చిన్నపిల్లలు, మహిళలు, పురుషులు, సంప్రదాయ వస్ర్తాలను వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన గోవా ఫెస్ట్-2018 కార్యక్రమంలో రాందేవ్ పేర్కొన్నారు. ఇప్పటికే కాస్మెటిక్, ఆహార పదార్థాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చామని స్పోర్ట్స్, యోగా కోసం అవసరమైన దుస్తులను తమ కంపెనీ ఆవిష్కరిస్తుందని బాబా చెప్పారు. స్వదేశీ బ్రాండ్‌తో దుస్తుల తయారీ వ్యాపారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని గతేడాది ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.