‘ఉగ్ర’ చెరలో పోలీస్‌ కుటుంబాలు

‘ఉగ్ర’ చెరలో పోలీస్‌ కుటుంబాలు

 శ్రీనగర్‌ : దక్షిణ కాశ్మీర్‌లోని నాలుగు జిల్లాల వ్యాప్తంగా పలువురు పోలీసు అధికారుల ఇళ్ళపై గురువారం సాయంత్రం దాడులు జరిపిన ఉగ్రవాదులు ఆరుగురు పోలీసులకు చెందిన 11మంది కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేశారని పోలీసులు తెలిపారు. గత రెండు రోజులుగా కొంతమంది ఉగ్రవాదుల బంధువుల ఇళ్ళపై దాడులు జరిపి వారి కుటుంబ సభ్యులను భద్రతా బలగాలు అరెస్టు చేసిన నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకు తీవ్రవాదులు పన్నిన కుట్రగా పోలీసు బలగాలు భావిస్తున్నాయి. పుల్వామా జిల్లాలో ఒక పోలీసును గురువారం ఇంటి నుండి కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు, ప్రశ్నించిన అనంతరం విడిచిపెట్టారు. పుల్వామా, అనంత్‌నాగ్‌, కుల్గామ్‌ జిల్లాల్లో పోలీసుల ఇళ్ళల్లోకి చొచ్చుకు వచ్చిన ఉగ్రవాదులు వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేశారు. 

కిడ్నాపైన వారిలో శ్రీనగర్‌లో పనిచేస్తున్న పోలీసు సోదరుడు, పోలీసు శిక్షణా కేంద్రంలో కుక్‌గా పనిచేస్తున్న మరో పోలీసు కుమారుడు వున్నారు. బుధవారం ఒక పోలీసు కుమారుడిని త్రాల్‌లో కిడ్నాప్‌ చేశారు. తమ కుమారుడిని విడుదల చేయాలని ఆ పోలీసు కుటుంబ సభ్యులు వేడుకున్నారు. తన కుమారుడి పట్ల దయ చూపించాలంటూ ఆమె తల్లి ఉగ్రవాద గ్రూపులను అభ్యర్ధించారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా ఈ కిడ్నాప్‌లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ''11 కిడ్నాప్‌లంటే కాశ్మీరు లోయలో పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్ధమవుతోంది. భద్రతా బలగాల అత్యాచారాల గురించి మాట్లాడే ప్రజలు లేదా నేతలు ఈ కిడ్నాప్‌ల గురించి మౌనంగా వున్నారెందుకని ప్రశ్నంచారు. కిడ్నాపైన వారినందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 

తీవ్రవాదుల కుటుంబ సభ్యులను అరెస్టు చేసినందుకు, ఇద్దరు ఉగ్రవాదుల నివాసాలను తగలబెట్టినందుకు నిరసనగా దక్షిణ కాశ్మీర్‌లో పలు చోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి. బుధవారం షోపియాన్‌లో జరిగిన దాడిలో నలుగురు పోలీసులు మరణించారని, ఆ తర్వాతే భద్రతా బలగాలు తీవ్రవాదుల ఇళ్ళను దగ్ధం చేశారని గ్రామస్తులు తెలిపారు. కాశ్మీర్‌లో గత 28ఏళ్ళ కాలంలో ఇలా పోలీసుల కుటుంబాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడం ఇదే ప్రధమం.