ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు

  లక్నో : ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలు పెద్ద ఎత్తున నష్టం కల్గించాయి. ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు, సంబంధిత ఘటనల కారణంగా 24 గంటల్లో సుమారు 16 మంది మృతి చెందగా, 12 మందికి పైగా గాయాలయ్యాయని అధికారులు ఆదివారం వెల్లడించారు. భారీ వర్షాలకు తోడు పెడ్డఎత్తున పిడుగులు కూడా పడడంతో ఎక్కువ మంది చనిపోయారు. కొన్ని చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీని రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరంతరం రద్దీగా ఉండే రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని కొన్ని ప్రాంతాలు ట్రాఫిక్‌ వలయంలో చిక్కుకు పోయాయి. 

మరికొన్ని ప్రాంతాలలో నీరు అలాగే నిలిచిపో యింది. పలు కీలక మార్గాలలో వాహనాల రాకపోకలు నిదా నంగా సాగాయి. మోడి మిల్‌ ఏరియా, సౌత్‌ ఎవెన్యూ, భైరవ్‌ మార్గ్‌, లజపతి నగర్‌ మార్కెట్‌, కేల ఘట్‌, కాశ్మీరి గేట్‌ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారమిస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలను ట్వీట్‌చేస్తున్నారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలోనూ, పొరుగు ప్రాంతాలలోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ''రానున్న రెండు రోజుల్లో నగరంలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ పరిసర ప్రాంతాలలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.'' అని వాతావరణ శాఖకు చెందిన కె. సతీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.