ఉత్తర ప్రదేశ్‌లో దళితుడిపై దాడి

ఉత్తర ప్రదేశ్‌లో దళితుడిపై దాడి

 లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లాలో దళితుడిపై దాడి చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తమ పొలాల్లో పనిచేసేందుకు నిరాకరించిన ఒక దళితుడ్ని నలుగురు చితకబాదడమే కాకుండా యూరిన్‌ తాగాలని అతనిపై ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా హజరత్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ అధికారిని సస్పెండ్‌ చేశారు. బాధితుడు సీతారామ్‌ వాల్మీకి కధనం ప్రకారం తమ పొలాల్లో గోధుమ పంట పండించాలని గ్రామానికి చెందిన పెద్దలు కోరారని, అందుకుగాను పశువుల మేతను ఆ పొలం నుండి సేకరించుకోమని చెప్పారు. దీనికి బాధితుడు తిరస్కరించడంతో అతనిని కొట్టి దుర్భాషలాడారు. 

వారితో విభేదించిన తనను పొలంలో దాణా సేకరిస్తున్న సమయంలో కొట్టడమే కాకుండా గ్రామంలోకి లాక్కెళ్ళారని, అక్కడ ఒక నిమ్మ చెట్టుకు కట్టేశారని బాధితుడు తెలిపాడు. ''నా దాడి చేయడమేగాక చివరకు యూరిన్‌ కూడా తాగించారు. చెప్పులతో కొట్టించారు.'' అంటూ వాల్మీకి ఆరోపించాడు. దీనికి సంబంధించి హజరత్‌ పోలీసు స్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యింది. ఐపిసి సెక్షన్‌ 308,342,332,504, 506 కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్లను కూడా వారిపై పెట్టినట్లు బదౌన్‌ పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి విజరు సింగ్‌, శైలేంద్ర సింగ్‌, విక్రమ్‌ సింగ్‌, పింకు సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అజమ్‌పూర్‌ విసౌరియా గ్రామానికి చెందివారు. కాగా బరేలి రేంజ్‌ ఐటి ధ్రువ్‌ కాంత్‌ ఠాకూర్‌ బాధితుడ్ని సోమవారం ఆయ న నివాసంలో కలుసుకున్నారు. ఈ కేసులో తగిన చర్యలు తీసుకోవాలని బదౌన్‌ ఎస్‌ఎస్‌పి అశోక్‌ కుమార్‌ను ఆదేశిం చారు.తొలుత బాధితుడి భార్య పోలీసులకు దాడి గురించి తెలిపేందుకు ప్రయత్నించింది కాని ఫలితం లేకపోయింది. పోలీసులు చర్య తీసుకోవడంలో విఫలమయ్యారు.