ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి హక్కుల కమిషన్‌ నోటీసులు

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి హక్కుల కమిషన్‌ నోటీసులు

  లక్నో : జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) శనివారం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో ఒకరిని కొట్టి చంపిన సంఘటనకు సంబంధించి ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా స్వీకరించింది. రాజేంద్ర అలియాస్‌ మను (28) అనే వ్యక్తిని కొంత మంది దుండగులు పోలీసు జీపు నుండి బయటకు లాగి కానిస్టేబుళ్ళ సమక్షంలోనే కొట్టి చంపారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. దాడికి పాల్పడిన దుండగుల నుండి పోలీసులు బాధితునికి రక్షణ కల్పించలేకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, డిజిపికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ సంఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులో పేర్కొంది.