వలసవాసుల పై ట్రంప్‌ మరో అస్త్రం

వలసవాసుల పై ట్రంప్‌ మరో అస్త్రం

  వాషింగ్టన్‌: అమెరికాలో వలసలను అడ్డుకునేందుకు ట్రంప్‌ ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది.. అమెరికా విధానాల మూలంగా ఉపాధి కరువై, బతుకు భారమై గ్వాటెమాల, హోండూరస్‌ వంటి మధ్య అమెరికా దేశాల నుంచి వలసల దండు కదలి వస్తున్న వారిని అడ్డుకునేందుకే ఈ వివాదాస్పద నిబంధనలను ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం వలసవాసులపై ట్రంప్‌ సర్కార్‌ నిర్దాక్షిణ్యంగా అణచివేతకు దిగుతుంది. అమెరికాకు వలస వచ్చినవారికి ఆశ్రయం లభించడం దుర్లభమవుతుంది. ట్రంప్‌ చర్య అమెరికా ఇప్పటివరకు అనుసరిస్తున్న వలసల విధానాన్ని తుంగలో తొక్కడమేనని, ఇది ఎంతమాత్రమూ అనుమతించరానిదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మెక్సికోతో సరిహద్దు పొడవునా గోడ కడతామని, అమెరికాకు వలసవచ్చినవారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం కల్పించడం ఇకపై కుదరదని ట్రంప్‌ ఇప్పటికే హుకుం జారీ చేశారు. ఇప్పుడు అమెరికా దేశీయ భద్రతా విభాగం ప్రచురించిన నూతన నిబంధనలపై సంతకం చేయడం ద్వారా వలసవాసుల హక్కులను కాలరాసేందుకు నేరుగా పూనుకున్నారు.