వరుసగా ఆరోసారి గుజరాత్‌లో విజయకేతనం

వరుసగా ఆరోసారి గుజరాత్‌లో విజయకేతనం

 అహ్మదాబాద్ : దేశమంతటా ఉత్కంఠ రేపిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ సర్కార్ నిర్ణయాలకు విషమ పరీక్షగా భావించిన ఈ ఎన్నికల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసి తన జైత్రయాత్రను కొనసాగించింది. గుజరాత్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో సైతం అధికార కాంగ్రెస్‌పై బీజేపీ విజయం సాధించింది. గుజరాత్‌లో వరుసగా ఆరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ సీట్లు మాత్రం తగ్గిపోయాయి. 

182 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 99 స్థానాలను గెలుపొందింది. బీజేపీకి గట్టిపోటీనిచ్చిన కాంగ్రెస్ తన పూర్వస్థితిని మెరుగుపరుచుకొని 77 స్థానాలు గెలుచుకుంది. ఇక హిమాచల్‌లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. 68 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 44, కాంగ్రెస్ 21 సీట్లలో గెలుపొందాయి. ఈ రెండు రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించగా, ప్రధాని మోదీ తన పార్టీ శ్రేణులను అభినందించారు. అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు సాగిస్తానని చెప్పారు.
 
అహ్మదాబాద్, డిసెంబర్ 18:గుజరాత్‌లో బీజేపీ మరోసారి తన సత్తా చాటింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి వరుసగా ఆరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గినా అధికారాన్ని నిలుపుకోగలిగింది. హిమాచల్ ప్రదేశ్‌ను కాంగ్రెస్ నుంచి కైవసం చేసుకుంది. మరో 18 నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రెండు రాష్ర్టాల్లో విజయం బీజేపీకి నైతిక బలాన్ని సమకూర్చింది.

182 స్థానాలు గల గుజరాత్‌లో బీజేపీ 99 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీతో హోరాహోరీగా తలపడ్డ కాంగ్రెస్ తన బలాన్ని 61 స్థానాల నుంచి 77కి పెంచుకుంది. ఇక 68 స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 44 సీట్లతో ఘనవిజయం సాధించింది. ఈ ఫలితాలపై ప్రధాని మోదీ ఈ రెండు రాష్ర్టాల ప్రజలకు సేవ చేయడానికి నిర్విరామంగా పనిచేస్తాం. ప్రగతి ప్రయాణం ముందుకు సాగడానికి ప్రయత్నిస్తానని భరోసా ఇస్తున్నాను అని ట్వీట్ చేశారు.