వసతి గృహం ఘటనపై ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఎన్‌సిడబ్యూ చీఫ్‌

వసతి గృహం ఘటనపై ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఎన్‌సిడబ్యూ చీఫ్‌

 పాట్నా : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్పూర్‌ వసతి గృహంలోని మైనర్లపై జరిగిన అత్యాచార ఘటనలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతిమలాలా లేఖ రాశారు. అందులో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు.'సర్‌ మీకు కుమార్తెలెవరూ లేరా, అయితే ముజఫర్‌పూర్‌ వసతి గృహంలో 34 మంది బాలికలపై అత్యాచారం జరగ్గా, ఎవరిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడంపై నేను అడగాలని అనుకుంటున్నాను, వీరిలో మీ కుమార్తెలా ఎవరు కనిపించలేదా, ఈ చర్యల వల్ల దేశంలో కోట్లాది మంది మహిళల, బాలికల గౌరవాన్ని మీరు కోల్పోయారు' అని లేఖలో పేర్కొన్నారు. 

ఈ ఘటన పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.' ఆ బాలికల మెరుగైన జీవనం కోసం పనిచేయడానికి తన బృందం, తాను సిద్ధం ఉన్నాం. వారికి సహాయం చేయడానికి దేశంలో మాలాంటి వారు లక్షల్లో ఉన్నారు' అని రాశారు. ఈ ఘటన గురించి వెల్లడిస్తూ ' ఈ ఘటన అనంతరం తాను నిద్రను కోల్పోయాను. బాలికలు పడుతున్న బాధ, దేశ ప్రజలకు సిగ్గుచేటు. నాకు తెలుసు బీహార్‌ నా రాష్ట్రం కాదు. కానీ తాను ఒక మహిళగా ఇది రాస్తున్నానని, మీరు చదువుతారని ఆశిస్తున్నానని' పేర్కొన్నారు. 'ఏప్రిల్‌లో వసతి గృహంలోని అకృత్యం గురించి టిస్‌ రిపోర్టు నివేదించింది.

కానీ ఈ మూడు నెలలుగా బీహార్‌ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నన్ను బాధించింది. కాగా, ఈ గృహన్ని నడుపుతున్న బ్రజేష్‌ ఠాకూర్‌కు మరిన్ని ప్రాజెక్టులు ఇచ్చారు. మీడియా కూడా సంఘటన గురించి హైలెట్‌ చేసిన మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసును వదిలించుకోవడానికి సిబిఐకి మాత్రమే అప్పగించారు. ఇదే కారణంగా అరెస్టు అయిన తర్వాత బ్రజేష్‌ ఠాకూర్‌ మెహంలో నవ్వును చూశాం' అని విమర్శల దాడి చేశారు. దీనితో పాటు మరిన్ని ప్రశ్నలను సంధించారు. 'ఇప్పుడే బాలికలకు న్యాయం చేయలేని ప్రభుత్వం, వారిని జాగ్రత్తగా చూసుకోగలదా? ఇంకా వసతి గృహాల్లో బాలికలు మగ్గుతుండగా వారి మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందా? వారు మంచి పాఠశాలలకు వెళ్లడం ప్రారంభించారా? వారి గత అనుభవాలను మర్చిపోవడానికి మానసిక వైద్య సహాయం అందించారా? ఎవరైనా వారి వాంగ్మూలాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారా?' అని ప్రశ్నించారు. నిందితులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. ''2008 లో వరదలు వచ్చినప్పుడు నేను బీహార్‌లో చాలా నెలలు గడిపాను. మీ మంచి పనులు గురించి విన్నాను. ఈ బాలికలు మీ సొంత కుమార్తెలని భావించినట్లయితే, వీరిని బాధపెట్టిన వారిపై చర్యలు తీసుకోండి' అని తెలిపారు.