విద్యా ప్రమాణాలు పెంచాలి

విద్యా ప్రమాణాలు పెంచాలి

  ముంబై : ఐఐటీల వంటి విద్యా సంస్థల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు సూచనలివ్వాలని ప్రధాని నరేంద్రమోదీ ఉపాధ్యాయులను, మేధావులను కోరారు. దేశానికి నూతన ఆవిష్కరణల అవసరం ఎంతగానో ఉన్నదని అంటూ, సృజనాత్మకత లేని సమాజాలు స్తబ్ధంగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. ముంబైలో శనివారం జరిగిన ఐఐటీ-బొంబాయి 56వ స్నాతకోత్సవంలో మోదీ పాల్గొన్నారు. బొంబాయి ఐఐటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధాని రూ.1000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏటా ఏడులక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారని తెలిపారు. వారికి అత్యున్నత ప్రమాణాలుగల విద్యను, అవసరమైన నైపుణ్యాన్ని కల్పించేందుకు సమిష్టి కృషి అవసరమని చెప్పారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు, మేధావులు సూచనలు, సలహాలివ్వాలని ఆ కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రధాని పేర్కొన్నారు. పరిమాణం మాత్రమే కాకుండా ప్రమాణాలు కూడా ఉన్నతస్థాయిలో ఉండేలా చూడటం మన బాధ్యత అని చెప్పారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే అందుకు పునాది రాళ్లుగా ఆవిష్కరణలు, పరిశ్రమలు ఉండాలని అన్నారు. వాటి ద్వారానే సాంకేతికతపై ఆధారపడిన స్థిరమైన దీర్ఘకాల ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని చెప్పారు.

భారతీయ సాంకేతిక సంస్థలు (ఐఐటీ)లు ప్రపంచంలో మన దేశానికి ఒక స్థాయిని కల్పించాయని, ఇప్పుడవి పరివర్తనకు సాధనంగా మారాయని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సృజనాత్మకత అన్నది ఊతపదంగా మారిపోయిందని చెప్పారు. ఐఐటీలు విజయవంతం కావడం వల్లనే దేశంలో కొత్తగా అనేక ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. దీంతో ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద సాంకేతిక శ్రమశక్తి కలిగిన దేశంగా ఆవిర్భవించిందని అన్నారు. ఐఐటీ విద్యార్థులు భారత్‌లో ఒక్కొక్క ఇటుకను పేర్చి ఐటీ రంగాన్ని నిర్మించారని ప్రధాని కొనియాడారు. దేశంలోని కొన్ని ఉత్తమ స్టార్టప్‌ల స్థాపనలో ఐఐటీ పట్టభద్రులు ముందున్నారని మోదీ చెప్పారు.

అనేక జాతీయ సమస్యలను పరిష్కరించడంలో సైతం ఈ స్టార్టప్‌లు ముందంజలో ఉన్నాయని అన్నారు. రానున్న రెండు దశాబ్దాలలో ప్రపంచ అభివృద్ధి పథాన్ని సృజనాత్మకత, నూతన సాంకేతిక పరిజ్ఞానం నిర్దేశిస్తాయని చెప్పారు. ఈ విషయంలో ఐఐటీల పాత్ర ఎంతో కీలకమైనదిగా ఉంటుందని తెలిపారు. 5జీ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్ పరిజ్ఞానం లేదా యంత్రాల ఆదాయం వంటివి స్మార్ట్ సిటీల రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఐఐటీలు కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలుగా ఉండిపోకుండా దేశ పరివర్తన సాధనాలుగా కూడా మారాయని అన్నారు. సాంకేతిక విప్లవానికి అతిపెద్ద ఆధారంగా ఐఐటీలు ఉన్నాయని చెప్పారు.

ఐఐటీలను నేడు యూనికార్న్ స్టార్టప్‌లు (వీటి విలువ 100 కోట్ల అమెరికన్ డాలర్లు)గా చూస్తున్నారని భవిష్యత్తులో ఇవి లక్ష కోట్ల డాలర్ల విలువైనవిగా మారగలవని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కారణంగా నేడు సాంకేతికత పరిజ్ఞానానికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కేంద్రంగా మారిందని మోదీ పేర్కొన్నారు. దేశంలో నేడు పదివేలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని, వాటికి నిధులు అందజేసేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటైందని తెలిపారు. ఏ సమాజమైనా సృజనాత్మకత లేకపోతే స్తబ్ధంగా మారిపోతుందని చెప్పారు. భారత్ స్టార్టప్‌ల కేంద్రంగా ఆవిర్భవిస్తున్నదని అన్నారు. సృజనాత్మకతకు, మౌలిక సదుపాయాలకు భారత్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సి ఉన్నదని చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వం వల్లనే కాదని, మీ వంటి యువత వల్ల జరుగుతుందని ఆయన ఐఐటీ విద్యార్థులనుద్దేశించి అన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు, నీటి సంరక్షణకు సృజనాత్మక విధానాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు.