వివాదంగా మారిన మ్యాగజైన్ ముఖచిత్రం!

వివాదంగా మారిన మ్యాగజైన్ ముఖచిత్రం!

  న్యూఢిల్లీ: ఓ మలయాళీ మ్యాగజైన్ ముఖచిత్రం పై బిడ్డకు పాలుపట్టిస్తున్న మోడల్ ఫొటోను ప్రచురించటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో అసభ్యకరంగా ఉన్నదని పేర్కొంటూ న్యాయస్థానం, కేరళ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌లోనూ కేసులు వేశారు. గృహలక్ష్మి అనే మలయాళీ మ్యాగజైన్ ముఖచిత్రంపై గిలు జోసెఫ్ అనే మోడల్ బిడ్డకు పాలిస్తున్న ఫొ టో ప్రచురించారు. ఫొటో అసభ్యంగా ఉన్నదని, ఇది మహిళల అసభ్య ప్రాతినిధ్య (నిషేధ) చట్టం 1986లోని సెక్షన్ 3, 4లను ఉల్లంఘించిందని ప్రచురణకర్తలు, మోడల్‌పై న్యాయవాది వినోద్ మాథ్యూ కొల్లం న్యాయస్థానంలో కేసువేశారు. కేసు విచారణను కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. ఫేక్ ఫీడింగ్, బాలల హక్కుల ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చిందని, దీన్ని పరిశీలిస్తున్నామని బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శోభా కోషి తెలిపారు.

ఈ నెల ఒకటో తేదీన వచ్చిన గృహలక్ష్మి సంచికపై మేం బిడ్డలకు పాలివ్వాల్సి ఉంది. దయచేసి మమ్మల్ని పొంచిపొంచి చూడొద్దని కేరళకు చెప్పండి తల్లులారా! అనే టైటిల్‌తో కవర్ ఫొటో ప్రచురించారు. సోషల్ మీడియాలో పలువురు దీన్ని ప్రశంసించగా, మరికొందరు దీనికి వ్యతిరేకంగా స్పందించారు. దుబాయ్‌కు చెందిన మలయాళీ మోడల్ గిలు జోసెఫ్ ఓ వీడియోలో ఈ వివాదంపై స్పంది స్తూ.. బహిరంగంగా తల్లిపాలు పట్టడంపై గృహలక్ష్మి జరుపుతున్న ప్రచారంలో ఇది ఓ భాగం. ఇది వాస్తవ సమస్య. ప్రస్తుతం సమాజంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ బిడ్డకు పాలుపట్టే వాతావరణం కల్పించలేదు. బిడ్డకు పాలుఇవ్వడం అనేది తల్లి హక్కు. దీని గురించి ఎవరూ భయపడాల్సిన లేదా సిగ్గుపడాల్సిన అవసరంలేదు అని చెప్పారు.