యుపి వసతిగృహంపై సిబిఐ అధికారుల దాడి

యుపి వసతిగృహంపై సిబిఐ అధికారుల దాడి

  లక్నో : ముజఫర్‌పూర్‌ వసతి గృహం ఘటన మరువకముందే యుపిలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ముజఫర్‌పూర్‌లో వసతిగృహంలోని ఏడు నుండి 14ఏళ్లలోపు 34మంది బాలికలపై దాని నిర్వాహకుడు, మరికొంతమంది అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కాగా, యుపిలోని డియోరియో వసతి గృహంలోని బాలికలను పనివారుగా చూస్తూ వారితో అనేక పనులు చేయిస్తున్నారంటూ వసతి గృహం నుండి తప్పించుకున్న ఒక బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు వసతి గృహంలో ఉన్న బాలికలను ఇదే విథంగా హింసిస్తూన్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. 

దీంతో వసతిగృహంపై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వసతిగృహం లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు సిబిఐ అధికారులు తెలిపారు. అందులో ఉన్న 24మంది బాలికలను రక్షించినట్లు అధికారులు తెలిపారు. వసతిగృహం వద్దకు వెళ్లిన అధికారులతో నిర్వాహకులు గిరిజా త్రిపాఠి, ఆమె భర్త తప్పుగా ప్రవర్తించారని, విచారణ సమయంలో కూడా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.