యుపిలో అమానుష దాడులు

యుపిలో అమానుష దాడులు

 న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో బజరంగ్‌ దళ్‌ గూండాలు సామాజిక కార్యకర్తలైన పాంకుడి పథక్‌, మరియా ఆలంలపై పోలీసుల సమక్షంలోనే దాడులకు పాల్పడుతుండటం పట్ల ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (ఐద్వా) దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కాగా, యుపిలో జరుగుతున్న ఈ అమానుష దాడులకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలు, సంస్థలు తమతో కలిసిపోరాడాలని ఈ సందర్భంగా ఐద్వా పిలుపునిచ్చింది. యోగి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీ వర్గాలపై పెరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ వారి కోసం పోరాడుతున్న సంస్థలు, వ్యక్తులను ప్రభుత్వం అణిచివేతకు గురిచేస్తోందని ఐద్వా విమర్శించింది. 

భజరంగ్‌దళ్‌ గూండాలకు మద్దతునిస్తున్న పోలీసులను వెంటనే బర్తరఫ్‌ చేయాలని, ఈ హత్యాకాండలకు పాల్పడిన నిందితులను అరెస్ట్‌ చేయాలని ఐద్వా డిమాండ్‌ చేస్తోంది. కాగా, 2018, సెప్టెంబర్‌ 17న అలీగఢ్‌లో ముస్తాక్‌, నౌషద్‌లను నకిలీ ఎన్‌కౌంటర్‌లో హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే వారి కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్లిన పాంకుడి పథక్‌ను బెదిరించడంతో పాటు ఆమె కారును ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతకుముందు, ఎటువంటి విచారణ లేకుండా ముస్తాక్‌, నౌషద్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్‌ చేయడంతో సామాజిక కార్యకర్త మరియా ఆలం ఇతర కార్యకర్తలతో పాటు ప్రశ్నించేందుకు గాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిపింది. కాగా, ఆరుగురు బాలురను పోలీసులు వారి నివాసాల నుండి బలవంతంగా తీసుకురావడంతో పాటు వారి కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారు.

వారిని అరెస్ట్‌ చేయడంపై ఆందోళన చేయకుండా నిరోధించేందుకు వారి కుటుంబసభ్యులను పోలీసులు గృహనిర్బంధం చేసినట్లు పేర్కొంది. దీంతో భజరంగ్‌ దళ్‌ గూండాల నుండి తమను తాము రక్షించుకునేందుకు పాంకుడి, మరియా ఆ ప్రాంతం నుండి పారిపోవలసి వచ్చిందని ఐద్వా ఆందోళన వ్యక్తం చేసింది. యుపిలో శాంతి భద్రతలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయని, పాలకవర్గాలు, పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేయడమే కాక ముస్లింలు, క్రిస్టియన్‌లు, దళితులపై దాడులు చేస్తున్న సంఫ్‌ు పరివార్‌ శక్తులకు అండగా నిలుస్తున్నాయని ఐద్వా వ్యాఖ్యానించింది. ఈ వర్గాలకు చెందిన అనేకమంది యువకులపై తప్పుడు కేసులు బనాయించారని, అలాగే నకిలీ ఎన్‌కౌంటర్‌లు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. యుపిలో మహిళలు కూడా సురక్షితంగా లేరనడానికి ఈ దాడులే నిదర్శనమని పేర్కొంది.