యుపిలో కొనసాగుతున్న అఘాయిత్యాలు

యుపిలో కొనసాగుతున్న అఘాయిత్యాలు

 లక్నో : ఇటీవల దేశంలో మైనర్‌ బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన తరహాలోనే మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెపై రెండు సంవత్సరాల క్రితం సామూహిక అత్యాచారం జరిగిందంటూ దళిత మహిళ ఫిర్యాదు చేశారు. వారు ఆ సంఘటనను వీడియో తీసి, పోలీసులకు చెబితే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరించారని తెలిపారు. ఆ ఘటన జరిగిన నాటి నుండి తన కుమార్తెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

కాగా, యుపిలోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో తన ఇంటి మేడపై నుండి తోసివేశాడు. తీవ్రగాయాలవ్వడంతో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పలుమార్లు ఆ వ్యక్తి తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్ట్‌ చేయలేదు. గత ఆదివారం 14 ఏళ్ల మైనర్‌ బాలికను నలుగురు ఆటో డ్రైవర్లు కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా, గత నెలలో కథువా ఘటన అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని ప్రకటించిన తర్వాత ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.