యుపిలోని మూడు షెల్టర్‌ హోమ్స్‌లో మహిళల గల్లంతు

యుపిలోని మూడు షెల్టర్‌ హోమ్స్‌లో మహిళల గల్లంతు

  లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్‌, హర్దోరు జిల్లాల్లో ఎన్‌జిఓలు నిర్వహిస్తున్న మూడు షెల్టర్‌ హోంల నుండి 53మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు దాఖలు కాలేదు. ప్రతాప్‌ఘర్‌ జిల్లాలోని రెండు షెల్టర్‌ హోంలను జిల్లా మేజిస్ట్రేట్‌ శంభు కుమార్‌ బుధవారం ఆకస్మాత్తుగా సందర్శించారు. అక్కడ 26మంది మహిళల ఆచూకీ తెలియరాలేదు. హర్దోరులోని మరో హోంలో 27మంది కనిపించడం లేదని తేలింది. అచల్‌పూర్‌, అషత్‌భుజా నగర్‌లోని హోంలను జిల్లా మేజిస్ట్రేట్‌ బృందం సోదా చేసిందని, అక్కడ కొంతమంది మహిళలు లేకపోవడంపై ప్రశ్నించగా వారు పనికోసం బయటకు వెళ్ళారని నిర్వాహకులు తెలిపారు. వారు చెప్పింది నిజమా కాదా అని నిర్ధారించేందుకు రాత్రి పూట కూడా వెళ్ళిచూశామని చెప్పారు. అచల్‌పూర్‌లో షెల్టర్‌ హోం రికార్డుల్లో 15మంది మహిళలు అని రాసివుందని, కానీ 12మంది అక్కడ లేరని మీడియా వార్తలు తెలిపాయి. అయితే ఆ తర్వాత పరిశీలించగా 17మందిలో 14మంది లేనట్లు వెల్లడైంది. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ, దియోరియాలోని షెల్టర్‌ హోంపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తుందన్నారు. ఎడిజి క్రైం ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.