యువతకు ఉద్యోగాలు, రైతు రుణాలు రద్దు

యువతకు ఉద్యోగాలు, రైతు రుణాలు రద్దు

  జైపూర్‌ : తాము అధికారంలోకి వస్తే రైతు రుణాలను రద్దు చేస్తామని, యువత అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌ శాఖ గురువారం పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. సోషల్‌ మీడియా వంటి బహుళ వేదికల ద్వారా సేకరించిన అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే మేనిఫెస్టోని రూపొందించామని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ చెప్పారు. దాదాపు 2లక్షల సూచనలు అందాయని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు రు.3500 భృతి ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల రక్షణకు ఒక చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రణాళికను నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేసేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది. డిసెంబరు 7న రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2013లో తాము చేసిన హామీల్లో 95శాతం నెరవేర్చామంటూ బిజెపి మంగళవారం తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది.