అఫ్గాన్‌లో ఏడుగురు భారతీయుల కిడ్నాప్‌

అఫ్గాన్‌లో ఏడుగురు భారతీయుల కిడ్నాప్‌

  కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లు అపహరణకు గురయ్యారు. అఫ్గాన్‌లోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లో భారత్‌కు చెందిన ఒక కంపెనీ తరఫున విద్యుత్‌ కాంట్రాక్ట్‌ పనుల్ని పర్యవేక్షిస్తున్న వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పొరబడి తాలిబన్లు అపహరించారని అఫ్గాన్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. కేఈసీ ఇంటర్నేషనల్‌ ఉద్యోగులైన వీరంతా ఆదివారం తెల్లవారుజామున మినీ బస్సులో విద్యుత్‌ నిర్వహణ పనుల కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక న్యూస్‌ చానల్‌ తెలిపింది. ఇంజనీర్లతో పాటు, వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్‌ను బాగ్లాన్‌ ప్రావిన్స్‌ రాజధాని పుల్‌–ఇ–ఖొమ్రిలోని బాగ్‌–ఇ–షమల్‌ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు అపహరించినట్లు వెల్లడించింది.

కాబూల్‌లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు కూడా  ఇంజనీర్ల కిడ్నాప్‌ను నిర్ధారించారు. కిడ్నాప్‌కు గురైన ఏడుగురు భారతీయులు అఫ్గాన్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. కిడ్నాపునకు గురైన వీరంతా ఏ రాష్ట్రం వారో ఇంకా తెలియరాలేదు. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. భారత్‌కు చెందిన ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ ఆర్‌పీజీ గ్రూపు అనుబంధ కంపెనీయే కేఈసీ ఇంటర్నేషనల్‌..