అమెరికాలో భారత విద్యార్థుల హవా

అమెరికాలో భారత విద్యార్థుల హవా

  వాషింగ్టన్‌: అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్‌ విభాగం శుక్రవారం విడుదలచేసిన స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ నివేదిక ప్రకారం 2017లో అమెరికాలో 2,49,763 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ జాబితాలో 4,81,106 మంది విద్యార్థులతో చైనా తొలిస్థానంలో నిలవగా, దక్షిణకొరియా(95,701), సౌదీ అరేబియా(72,358), జపాన్‌(41,862) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక 24 నెలల గడువుండే సైన్స్‌–టెక్నాలజీ–ఇంజనీరింగ్‌–గణితం(స్టెమ్‌) ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)లో సైతం భారతీయ విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నట్లు ఇమిగ్రేషన్‌ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికాలో స్టెమ్‌ డిగ్రీ విద్యార్థులకు అదనంగా ఉండే ఈ కోర్సులో గతేడాది 89,839 మంది విదేశీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. వీరిలో భారతీయులు(53,507 మంది) తొలిస్థానంలో ఉండగా, చైనీయులు(21,705), దక్షిణకొరియా (1,670), తైవాన్‌(1,360), ఇరాన్‌(1,161) విద్యార్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారని పేర్కొన్నారు.