అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

    అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన పృధ్వీరాజ్‌ (26) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సిన్సినాటి ప్రాంతంలో చోటు చేసుకుంది. చెంచుపేటకు చెందిన కందేపి గోపిచంద్‌, సుధారాణి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుధారాణి గృహిణి కాగా, గోపిచంద్‌ గృహానిర్మాణ శాఖలో డిప్యూటీ ఇంజినీర్‌గా అమరావతిలో పని చేస్తున్నారు. కుమారుడు పృథ్వీరాజ్‌ ఆరేళ్ల కిందట బీటెక్‌ పూర్తి చేసి, ఎంఎస్‌ చదివేందుకు కాలిఫోర్నియాకు వెళ్లాడు. పీజీ పూర్తయిన అనంతరం సిన్సినాటి ప్రాంతంలో ఓహియో స్టేస్‌టోని 53 బ్యాంక్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం పొందాడు.

రెండేళ్లుగా అక్కడే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం విధులు ముగించుకుని బయటకు వస్తుండగా ఓ అగంతకుడు విచక్షణా రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించాడు. దీంతో పృథ్వీరాజ్‌తో పాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పృథ్వీరాజ్‌ ఘటనా స్థలిలోనే మృతి చెందినట్లు బ్యాంకు అధికారులు, అమెరికాలోని తెలుగు అసోసియేషన్‌ (తానా) సభ్యులు పృథ్వీరాజ్‌ కుటుంబ సభ్యులకు శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందించారు. కుమారుడి మృతి వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తెనాలి గౌతం మోడల్‌స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసిన పృథ్వీరాజ్‌, రాయవెల్లూరు విట్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. మరోవైపు పృథ్వీరాజ్‌కు వివాహ ప్రయత్నాల్లో ఉండగా ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులను షాక్‌కు గురిచేసింది.