ఆస్ట్రేలియాలో  బీచ్‌లో ముగ్గురు తెలంగాణవాసుల గల్లంతు

ఆస్ట్రేలియాలో  బీచ్‌లో ముగ్గురు తెలంగాణవాసుల గల్లంతు

 ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. ఉద్యోగరీత్యా తెలంగాణ నుంచి అక్కడికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు సోమవారం న్యూసౌత్‌వేల్స్‌లోని మూనీ బీచ్‌లో నీటమునిగి మృతిచెందగా.. మరొకరు సముద్రంలో గల్లంతయ్యారు. వీరంతా సముద్రంలో మునిగిపోతున్న తమ పిల్లలను కాపాడే ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. మృతులను నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కకు చెందిన ఎండీ గౌసుద్దీన్ (45), హైదరాబాద్‌లోని రామచంద్రపురానికి (బీహెచ్‌ఈఎల్) చెందిన సయ్యద్ రహత్ (35), గల్లంతయిన వ్యక్తిని మాన్యంచెల్కకు చెందిన ఎండీ జునైద్ (28)గా గుర్తించారు. దీంతో వారికుటుంబాల్లో విషాదం అలుముకున్నది. 

బంధువుల కథనం ప్రకారం.. నల్లగొండలోని మాన్యంచెల్కకు చెందిన ఎండీ గౌసుద్దీన్ ఐదేండ్లుగా ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. రెండేండ్ల క్రితం వచ్చి తన మేనల్లుడు ఎండీ జునైద్ ను ఉన్నత చదువుల కోసం తీసుకెళ్లాడు. ఎంఫార్మసీ పూర్తిచేసిన జునైద్ అక్కడే పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ తన మామతోనే కలిసి ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం గౌసుద్దీన్ తన భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, అల్లుడు జునైద్‌తో పాటు హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌కు చెందిన స్నేహితుడు రహత్ కుటుంబంతో కలిసి మూనీ బీచ్‌కు వెళ్లాడు. వారు అక్కడ సరదాగా గడిపారు.

గౌసుద్దీన్, రహత్‌ల భార్యలు బీచ్ పైభాగంలో ఉండగా ముగ్గురు పిల్లలు బీచ్ అంచున ఆడుకోసాగారు. స్నానం చేసేందుకు గౌసుద్దీన్, రహత్, జునైద్ సముద్రంలో కొద్దిగా లోనికి వెళ్లడంతో అలల ఉధృతికి వారు నీటమునిగి గల్లంతయ్యారు. పిల్లలు సైతం నీటిలో మునిగిపోవడంతో అక్కడివారు రక్షించారు. ఆ వెం టనే స్థానికులతోపాటు అక్కడి అధికారులు గాలింపు నిర్వహించి గౌసుద్దీన్, రహత్‌ల మృతదేహాలను వెలికితీశారు. జునైద్ ఆచూకీ లభించలేదు. నీటమునగడం వల్ల స్పృహ కోల్పోయిన ఆ పిల్లలను హుటాహుటిన స్థానిక దవాఖానకు తరలించగా.. కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.