భారత సంతతి గణిత శాస్త్రవేత్తకు ఫీల్డ్స్‌ పురస్కారం

భారత సంతతి గణిత శాస్త్రవేత్తకు ఫీల్డ్స్‌ పురస్కారం

   రియో డి జనీరో : గణితశాస్త్రంలో నోబుల్‌ ప్రైజ్‌గా భావించే ప్రతిష్టాత్మక ఫీల్డ్స్‌ మెడల్‌ అవార్డును భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త అక్షరు వెంకటేష్‌ అందుకు న్నారు. బ్రెజిల్‌లో రియో డి జనీరోలో జరుగుతున్న 2018 అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల కాంగ్రెస్‌లో బుధవారం ఈ అవార్డును అక్షరు వెంకటేష్‌కు ప్రదానం చేశారు. ఈ అవార్డును వెంకటేష్‌తో పాటు నలుగురికి అందచేశారు. ఈ ఫీల్డ్స్‌ అవార్డును ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ప్రకటిస్తారు. అలాగే 40 ఏళ్ల లోపు గణిత శాస్త్రవేత్తలకు మాత్రమే ఇస్తారు. కెనడాకు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త జాన్‌ చార్లెస్‌ ఫీల్డ్స్‌ కోరిక మేర అవార్డును 1932 నుంచి ప్రారంభించారు. 

ఈ అవార్డు కింద 15,000 కెనడా డాలర్లును అందచేస్తారు. ఈ ఏడాది వెంకటేష్‌తో పాటు కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రొఫెసర్‌, ఇరాన్‌-కుర్దిస్‌ సంతతి శాస్త్రవేత్త చౌచెర్‌ బిర్కార్‌, పీటర్‌ స్కోల్జ్‌ (జర్మనీ), అలెస్సి ఫిగాలి (ఇటలీ)కు ప్రకటించారు. 36 ఏళ్ల భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త వెంకటేష్‌ ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలో జన్మించిన వెంకటేష్‌ తన రెండేళ్ల వయస్సులోనే తల్లితండ్రులతో కలిసి పెర్త్‌ (ఆస్ట్రేలియా)కు వలస వెళ్లారు. ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ఒలింపియాడ్స్‌లో 11, 12 ఏళ్లలోనే పతకాలు సాధించారు. 16 ఏళ్ల వయస్సులోనే వెంకటేష్‌ గణితంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 20 ఏళ్లకే పిహెచ్‌డి అందుకున్నారు. గణితశాస్త్రంలో ప్రముఖ పరిశోధకులుగా గుర్తింపు పొందారు.