భారత సంతతికి చెందిన యువతిపై దాడి

భారత సంతతికి చెందిన యువతిపై దాడి

  న్యూయార్క్‌ : భారత సంతతికి చెందిన అమెరికా నివాసి అవనీత్‌ కౌర్‌ (20)పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్‌ బరోలో అల్లా షహీద్‌ (54) అనే వ్యక్తి గత నెలలో హేయమైన రీతిలో దాడికి పాల్పడ్డాడు. కౌర్‌ ఫిర్యాదు ప్రకారం, ఆమె గత నెలలో మాన్‌హట్టన్‌లోని ఒక సబ్‌వే రైలులో ప్రయాణిస్తుండగా, షహీద్‌ వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా స్వలింగ సంపర్కులు అంటూ ఆమెను, అమె స్నేహితురాలిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడాడు. అనంతరం వారిద్దరూ రైలు దిగి వెళ్తుండగా, వెనుక నుండి దాడి చేసి కౌర్‌ తలపై, ఛాతీపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడే ఉన్న ఒక స్తంభానికి ఢకొీని పడిపోయింది. 

కాగా, విచారణలో తాను కౌర్‌ పట్ల అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితురాలని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అల్లాషహీద్‌ నిందితుడిగా నిరూపించబడితే అతనికి మూడున్నర సంవత్సరాల నుండి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశముందని క్వీన్స్‌ జిల్లా అటార్నీ రిచార్డ్‌ బ్రౌన్‌ తెలిపారు. ''క్వీన్స్‌ కౌంటీ దేశంలోనే అత్యంత విభిన్నమైంది. పలు దేశస్థులు, పలు జాతుల వారు ప్రత్యేకించి విపరీత లైంగిక ధోరణులు వుండే వారు ఎక్కువగా నివసిస్తారు. ప్రత్యేకించి హింసాత్మక సంఘటనలతో ప్రమేయమున్న వారిని ఇక్కడి ప్రజలు సహించరు.చట్ట ప్రకారం విచారణ జరిపి తీవ్రంగా శిక్షించడం జరుగుతుందని ఆయన అన్నారు.