భారతీయ అమెరికన్లపై కాల్పులు-ఒకరి మృతి

భారతీయ అమెరికన్లపై కాల్పులు-ఒకరి మృతి

 వాషింగ్టన్: ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఓ భారతీయ అమెరికన్ మృత్యువాత పడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. బర్నెట్ ఫెర్రీ రోడ్డులోని ఓ దుకాణంలో పనిచేస్తున్న 44 ఏండ్ల పరమ్‌జిత్‌సింగ్‌పై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పరమ్‌జిత్‌పై కాల్పులు జరిపిన అనంతరం అక్కడే ఉన్న మరో దుకాణంలోకి వెళ్లిన దుండగుడు.. అక్కడ క్లర్క్‌గా పనిచేస్తున్న పార్తీ పటేల్ (30)పై కాల్పులు జరిపాడు. అనంతరం దుకాణంలో ఉన్న నగదును చోరీచేసి పారిపోయాడు. 


ప్రస్తుతం పార్తీ పటేల్ పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై దర్యాప్తు చేసిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుడిని లామార్ రషద్ నికోలస్ (28)గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిపై హత్యానేరంతోపాటు చోరీ, దాడి తదితర కేసులను నమోదు చేశారు. నిందితుడు కాల్పులు జరుపడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కాల్పుల్లో చనిపోయిన పరమ్‌జిత్‌సింగ్ ఎనిమిదేండ్ల కిందట అమెరికా వచ్చాడని స్థానికంగా వ్యాపారం నిర్వహించే అతని సోదరుడు తెలిపారు. బాధితునికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు వెల్లడించారు.